గాంధారి, ఆగస్టు 20: అన్యాక్రాంతమై పోతున్న అటవీ భూములను రక్షించడానికి ఓ పల్లె నడుం బిగించింది. ఆక్రమణకు గురైన అటవీ ప్రాంతాన్ని కాపాడుకునేందుకు ముందడుగు వేసింది. అడవుల సంరక్షణ కోసం ఊరు ఊరంతా ఏకమైంది. కబ్జాలను తొలగించి ఫారెస్టు భూములకు విముక్తి కల్పించింది. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గౌరారం గ్రామ శివారులో ఉన్న అటవీ భూములు క్రమంగా ఆక్రమణకు గురవుతున్నాయి. పచ్చని అడవి తల్లి కనుమరుగై పోతున్నదని ఆవేదనకు గురైన గ్రామస్తులు ఆలోచనలో పడ్డారు.
ఆక్రమణలతో ఆవాసం కోల్పోయి అడవి జంతువులు ఊర్లల్లోకి వస్తున్నాయని గుర్తించిన స్థానికులు అడవుల సంరక్షణకు అండగా నిలబడాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ మేరకు మంగళవారం కార్యాచరణ కూడా ప్రారంభించారు. అటవీ భూముల్లోని చెట్లను అక్రమంగా సాగు చేస్తున్న పంటలను, అందులో వేసిన గుడిసెలను.. ఫారెస్టు అధికారులతో కలిసి తొలగించారు. చుట్టు పక్కల తండా వాసులు, గ్రామస్తులు అత్యాశతో అడవులను నరికి పంటలు సాగు చేస్తుండడంతో పర్యావరణం దెబ్బ తింటున్నదని గౌరారం వాసులు తెలిపారు.
గ్రామ శివారులోని అటవీ భూములను నరికివేయడంతో దట్టమైన అడవి కనుమరుగై పోతున్నదన్నారు. పశువులకు మేత మేయడానికి స్థలం కరువైందని, అటవీ జంతువులకు సైతం రక్షణ లేక ఊరిలోకి వస్తున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలోనే అడవుల సంరక్షణకు కదలాలని ఊరంతా కలిసి తీర్మానించామని వారు చెప్పారు. అడవుల రక్షణకు ముందుకొచ్చిన గౌరారం గ్రామస్తులను ఫారెస్టు సిబ్బంది అభినందించారు. చుట్టు పక్కల గ్రామస్తులు.. వారిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.