నిజామాబాద్, జూలై 13, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఒకప్పుడు భారీ వృక్ష సంపదతో, పుష్కలమైన జంతుజాలంతో కళకళలాడిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అటవీ సంపద ఇప్పుడు నేలమట్టం అవుతోంది. రాత్రి, పగలు తేడా లేకుండా అడవి నరికివేతకు తోడుగా జంతువుల వేట అడ్డూ అదుపు లేకుండా సాగుతోంది. ముఠాలుగా ఏర్పడి దుండగులు అందిన కాడికి అడవిని దోచుకుంటున్నారు. ఓ వైపు కలపను, మరోవైపు భూ ఆక్రమణ, ఇంకోవైపు జంతువులను హతమారుస్తూ సవాల్ విసురుతున్నారు. వేటగాళ్ల అలజడికి అడవి ప్రాంతమంతా ఆగమాగం అవుతోంది.
జంతుజాలం జీవించలేక పరుగులు తీస్తూ మైదాన ప్రాంతాలకు పయనమై చెల్లాచెదురవుతున్నాయి. ఈ మధ్య శాఖాహార జంతువులైన దుప్పి, మనుబోతు, జింకలు తరచూ జనావాసాల్లోకి వచ్చి ప్రమాదాలకు గురవ్వడం ఇందులో భాగంగానే కనిపిస్తోంది. ఇదంతా ఒకెత్తు అయితే… భయంకరమైన వేటగాళ్ల దుశ్చర్యలు రోజురోజుకు పేట్రేగి పోతోంది. గొడ్డళ్లు, పిస్తోళ్లు, నాటు తుపాకలుతో అడవుల్లో మారణాయుధాలతో జంతువుల పాలిట యమకింకరులుగా మారి చంపేస్తున్నారు. పెద్ద పులితో మొదలు పెడితే జిం కలు, అడవి కుందేళ్ల ప్రాణాలకు భరోసా లేకుండా పో తోంది. ఏడాది కాలంగా వెలుగు చూసిన పెద్ద పులుల గల్లంతు, తాజాగా చిరుత కళేబరాల పట్టివేత ఘటనలు చర్చనీయాంశం అవుతున్నాయి.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అటవీ ప్రాం తం గోదావరి నదిని ఆనుకుని మొదలై కామారెడ్డి జిల్లా మాచారెడ్డి వరకు విస్తరించి ఉంది. ఇందులో కమ్మర్పల్లి, ఇందల్వాయి, మాచారెడ్డి రేంజ్‌లు కీలకంగా ఉంటాయి. కమ్మర్పల్లి, భీంగల్, సిరికొండ, ధర్పల్లి, ఇందల్వాయి, సదాశివనగర్, రామారెడ్డి, మాచారెడ్డి ఏరియాలో వేటగాళ్లకు లింకులు ఉన్నట్లుగా తెలుస్తోంది. భీంగల్‌లో చిరుతను హతమార్చిన దుండగులు స్థానికులే. వీళ్లను విచారిస్తే లింకు ధర్పల్లిలో దొరికింది. ధర్పల్లిలో లోతుగా పరిశోధిస్తే మరికొంత మంది లింకులు బయట పడే అవకాశాలు ఉన్నాయి.
కేటుగాళ్లు అంతా కలిసి రెండు జిల్లాలు, మూడు అటవీ రేంజ్ పరిధిలో గొలుసు కట్టు సంబంధాలను నెరుపుతున్నట్లుగా తెలుస్తోంది. జంతువుల కదలికలను గుర్తించి ఒకరికొకరు సమాచారాన్ని మార్పిడి చేసుకుని వేటకు సిద్ధమవుతున్నారనే ప్రచారం ఉంది. అందులో భాగంగానే కచ్చితమైన జాడను గుర్తించి హత మారుస్తున్నట్లుగా అర్థం అవుతోంది. అడవి చుట్టూత ముఠాలు గుట్టుగా పని చేస్తుండటంతోనే జంతుజాలానికి పెను ప్రమాదం ఏర్పడినట్లు అయ్యింది. చూడటానికి అమాయకంగా కనిపించే వేటగాళ్లు వారి నివాసాలకు దూరంగా నాటు తుపాకులను సైతం దాచి పెట్టుకుంటున్నారు. అత్యవసర వేళలో వేటకు, అడ్డుకునే అటవీ అధికారులపై దాడులు చేసి తప్పించుకునేందుకు వాడుతున్నట్లుగా తెలుస్తోంది.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గతంలో పని చేసిన అటవీ శాఖ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఏళ్లుగా ఈ ప్రాంతంలో పని చేసినప్పటికీ క్షేత్ర స్థాయిలో అటవీ సంపదను కాపాడకపోవడం, జంతుజాలానికి రక్షణ కవచం ఏర్పా టు చేయడంలో శ్రద్ధ చూపకపోవడంతోనే తీవ్ర నష్టం వాటిల్లింది. నిఘా కొరవడటం మూలంగానే అడవిలో ఇంతటి ఘోరమైన ఘటనలు వెలుగు చూస్తున్నాయని వన్యప్రాణి ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పులి వచ్చినప్పుడే ఏడాది క్రితం అప్రమత్తమై ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది.
పెద్ద పులుల రాకను దాచి పెట్టేందుకు ప్రయత్నించి, సమాచారాన్ని జనాలకు చేరకుండా అతి జాగ్రత్తలు పాటించడానికి చూపిన శ్రద్ధను వాటి ప్రాణాలను రక్షించేందుకు చూపించకపోవడం విడ్డూరంగా మారిందని సొంత శాఖలోని సిబ్బందే విమర్శిస్తున్నారు. రెండు చిరుత పులుల కళేబరాలను పరిశీలిస్తే వాటిని 2 నుంచి 3 నెలల క్రితమే హతమార్చినట్లుగా తెలుస్తోంది. ఆ సమయంలో ఆయా ప్రాంతాల్లో పని చేసిన అటవీ అధికారుల పనితీరును సమీక్షించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. భీంగల్, ధర్పల్లిలో పట్టుబడిన వేటగాళ్ల కూపీ లాగితే మరిన్ని జంతువుల అవశేషాలు లభించే అవకాశాలు లేకపోలేదన్న చర్చ నడుస్తోంది.