Beerkur MJP School | బీర్కూర్ : బీర్కూరు మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాల, కళాశాలలో ఆదివారం రాత్రి భోజనం వికటించి 17 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని వెంటనే 108 అంబులెన్స్ లో బాన్సువాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రాత్రి 12 మంది విద్యార్థులను ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. కాగా సోమవారం మరో ఐదుగురి విద్యార్థులను బాన్సువాడ ఆసుపత్రికి తరలించారు.
15 మంది విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని వారిని డిశ్చార్జ్ చేసినట్లు, మరో ఇద్దరు విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు బీర్కూర్ మండల వైద్యాధికారిని శ్రీలేఖ తెలిపారు. ఆదివారం రాత్రి 9 గంటలకు భోజనం చేయగా కొంతమంది విద్యార్థులకు వాంతులు, విరోచనాలు మొదలయ్యాయని అన్నారు. మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాలలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి విద్యార్థులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు ఆమె తెలిపారు. సోమవారం ఉదయం బీర్కూర్ సర్పంచ్ ధర్మతేజ బాన్సువాడ ఆసుపత్రికి వెళ్లి విద్యార్థులను పరామర్శించారు.