Food distribution | శక్కర్ నగర్ : బోధన్ పట్టణంలోని 18వ వార్డులో గల వినాయక మండపం వద్ద శుక్రవారం ఎంఐఎం పట్టణ అధ్యక్షుడు మీర్ ఇలియాజ్ అలీ అన్నదానం చేశారు. కులమతాలకు అతీతంగా ఆయన ప్రతీ ఏడు వినాయక చవితి సందర్భంగా నిర్వహించే నవరాత్రి ఉత్సవాల్లో తన వంతుగా అన్నదానం నిర్వహిస్తారు. ఇందులో భాగంగానే ఈ ఏడు చివరి రోజైన శుక్రవారం అంబేద్కర్ కాలనీలోని వినాయక మండపం వద్ద ఆయన అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగించారు.
ఈ సందర్భంగా ఇలియాజ్ అలీ, పార్టీ ప్రతినిధులతో కలిసి వడ్డనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోధన్ పట్టణంలో కులమతాలకు అతీతంగా అందరం కలిసి మెలసి అన్ని పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకుంటామని అన్నారు. సోదర భావానికి ప్రతీకగా.. తాను ప్రతి ఏడు వినాయక మండపాల వద్ద సొంత ఖర్చులతో అన్నదానం నిర్వహిస్తారని.. ఇది తనకు ఎంతో ఆనందంగా ఉంటుందని అన్నారు.
ఈ సందర్భంగా వినాయక మండపం నిర్వాహకులు అన్నదాత మీర్ ఇలియాజ్ అలీని ఘనంగా సత్కరించారు. ఆయనకు శాలువా కప్పి పూలమాలలు వేసి సన్మానం చేయడంతో పాటు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మీర్ ఇలియాజ్ అలీ తోపాటు హాజీ బిల్డర్, వినాయక మండపం నిర్వాహకులు, తదితరులు ఉన్నారు.