మెండోరా: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కు ఎగువ ప్రాంతాల నుంచి మూడు రోజులుగా భారీగా వరద నీరు వచ్చి చేరుతుందని ఏఈఈ వంశీ తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ లోకి 3,82,430 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందని ఆయన వెల్లడించారు. దీంతో ప్రాజెక్ట్‌కు చెందిన 33 వరద గేట్ల నుంచి 3,99,840 క్యూసెక్కుల మిగులు జలాలను గోదావరిలోకి విడుదల చేస్తున్నట్లు వివరించారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు( 90.313 టీఎంసీలు)నీటి సామర్థ్యం కాగా గురువారం సాయంత్రానికి ప్రాజెక్ట్ నీటిమట్టం 1087.10 అడుగులు(73.547 టీఎంసీల) నీటి నిల్వ ఉందని పేర్కొన్నారు.
ప్రాజెక్ట్ ప్రధాన కాలువ కాకతీయ నుంచి 6 వేలు, సరస్వతీ కాలువకు 800, ఎస్కేప్ గేట్లనుంచి గోదావరిలోకి 1500 క్యూసెక్కుల నీటివిడుదల కొనసాగుతుందన్నారు. ఈ సీజన్లో ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్ట్ లోకి 445.707 టీఎంసీల వరద నీరు వచ్చిందని పేర్కోన్నారు.