నమస్తే యంత్రాంగం, సెప్టెంబర్ 2: భారీ వర్షాలు తెరిపినివ్వడం లేదు. మూడు రోజులుగా కురుస్తున్న వానలతో చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. ప్రజలకు, అన్నదాతలకు అంతులేని కష్టాలు తెచ్చిపెట్టాయి. ఉమ్మడి జిల్లాలో మరిన్ని భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో మంగళవారం కూడా విద్యాసంస్థలకు బంద్ ప్రకటించారు. ఇక, గడిచిన 24 గంటల్లో నిజామాబాద్ జిల్లాలో 8 సెం.మీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. అత్యధికంగా సిరికొండలో 17.21, ముప్కాల్‌లో 13, మెండోరా, మోర్తాడ్ మండలాల్లో 10 సెం.మీటర్లకు పైగా వర్షం కురిసింది.
కామారెడ్డి/ఖలీల్‌వాడి: అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయన్న హెచ్చరికల నేపథ్యంలో మంగళవారం కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. విద్యార్థులు ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో మంగళవారం కూడా సెలవు ప్రకటిస్తున్నట్లు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లు రాజీవ్‌గాంధీ హనుమంతు, ఆశీష్ సాంగ్వాన్ తెలిపారు.
నిజాంసాగర్ మినహా ఉభయ జిల్లాల్లోని ప్రాజెక్టులన్నీ పూర్తిగా నిండాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తడంతో 41 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. పోచారం ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో అలుగు పారుతున్నది. చారిత్రక కట్టడం నుంచి ప్రవహిస్తున్న వరదను చూసేందుకు జనాలు తరలిరాగా, రక్షణ చర్యల్లో భాగంగా పోలీసులు అనుమతించలేదు.
కళ్యాణి ప్రాజెక్టు నుంచి 600 క్యూసెక్కులు, సింగీతం నుంచి 10,500 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. నిజాంసాగర్‌కు 57,700 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 17.802 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 9 టీఎంసీలకు చేరింది. సింగూర్ ప్రాజెక్టు 29.917 టీఎంసీలకు గాను 18.202 టీఎంసీలకు నీటి నిల్వ చేరుకుంది. భారీగా వరద వస్తుండడంతో అలీసాగర్ జలాశయం ఒక గేటును ఎత్తారు.