మోర్తాడ్, అక్టోబర్ 9: మండలంలోని గాండ్లపేట్ సమీపంలో పెద్దవాగుపై నిర్మించిన అక్విడెక్ట్ పక్కనే వరదకాలువకు శుక్రవారం ఉదయం గండిపడింది. దీంతో వరదకాలువలో ఉన్న నీరంతా బయటికి రావడంతో సమీపంలోని పంటలన్నీ నీటమునిగి ఇసుకమేటలతో కప్పివేయబడ్డాయి. వరదకాలువ గండి నుంచి బయటికి వస్తున్న నీరంతా పెద్దవాగులోకి వెళ్తున్నది. సమీపంలో ఇండ్లు లేకపోవడంతో ఎటువంటి ప్రమాదమూ జరగలేదు. అక్విడెక్ట్ సమీపంలో వరదకాలువ లోపలిభాగం సీసీతో నిర్మించిన ప్రాంతంలో గండిపడడంపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు విచారణ జరిపించాలని వారు కోరుతున్నారు.
వరదకాలువకు గండిపడిన ప్రాంతాన్ని వరదకాలువ సీఈ సుధాకర్‌రెడ్డి, ఎస్సారెస్పీ ఎస్ఈ జగదీశ్, ఈఈ, ఏఈఈలు పరిశీలించారు. చాలా రోజులుగా వరదకాలువలో ఎక్కువ మొత్తంలో నీళ్లు విడుదల చేయడం, భారీవర్షాల కారణంగా వరద ఉధృతికి మట్టి కొట్టుకుపోయి మెత్తబడడం తదితర కారణాలై ఉండవచ్చని వారు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. నీళ్లన్ని వెళ్లిపోయిన తరువాత పరిశీలిస్తే తప్ప కచ్చితమైన విషయాన్ని చెప్పలేమని తెలిపారు. వానకాలం పంటలకు నీరందించడం పూర్తయ్యిందని, యాసంగికి నీరందించడానికి అప్పటి లోగా గండిపడిన ప్రాంతంలో మరమ్మతుల కోసం ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని తెలిపారు. వరదకాలువకు గండిపడడంతో అక్విడెక్ట్‌కు ఎటువంటి నష్టం జరగలేదని చెప్పారు. వరద కాలువకు గండిపడిన నేపథ్యంలో తహసీల్దార్ కృష్ణ, ఎస్సై రాముల పరిశీలించి, ప్రజలను అప్రమత్తం చేశారు.