నిజామాబాద్, నవంబర్ 4(నమస్తే తెలంగాణ ప్రతినిధి) ; ఎన్నికల వేడి రాజుకుంది. నామినేషన్ల స్వీకరణ కూడా మొదలైంది. ప్రచార పర్వమూ జోరందుకుంది. నామినేషన్ల దాఖలుకు మరో ఐదు రోజుల గడువే మిగిలి ఉంది. కీలకమైన ఈ తరుణంలో ఆ రెండు పార్టీలు గందరగోళంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇప్పటికీ అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. షెడ్యూల్ రాకముందు తెగ హడావుడి చేసిన కాంగ్రెస్, బీజేపీ.. సరిగ్గా నామినేషన్ల సమయానికి ఆగమాగమవుతున్నాయి. పోటీ చేయడానికి అభ్యర్థులే కరువైన తరుణంలో జంపింగ్ జపాంగ్‌లను నమ్ముకుంటున్నాయి. అధికార బీఆర్ఎస్ ప్రచారంతో ప్రజల్లోకి దూసుకుపోతుండగా, అభ్యర్థుల ఎంపిక కూడా పూర్తి చేయలేని కాంగ్రెస్ ఎన్నికలకు ముందే ‘చేతు’లెత్తేసింది. నిజామాబాద్ అర్బన్, కామారెడ్డి వంటి కీలక స్థానాల్లో ఇంకా క్యాండిడేట్లనే ప్రకటించలేదు. ఇక, కమలం పార్టీ కూడా ముందే కాడి వదిలేసింది. ఆ పార్టీకి బాన్సువాడ, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో అభ్యర్థులే దొరకని పరిస్థితి నెలకొంది.
పైన పటారం..లోన లోటారం అన్నట్లుగా మారింది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ప్రతిపక్ష పార్టీల దుస్థితి. ఎన్నికల రణక్షేత్రంలో ప్రతిపక్షాలు అభ్యర్థుల్లేకుండానే డాంభికాలు ప్రదర్శిస్తున్నాయి. భారత రాష్ట్ర సమితిని ఓడిస్తామంటూ భారీ ప్రకటనలు చేస్తున్నప్పటికీ వారెవ్వరికీ కనీసం అభ్యర్థులే కరువవ్వడంతో ఆగమాగమయ్యే పరిస్థితి ఉన్నది. నేటికీ ఇరు పార్టీలకు కనీసం అభ్యర్థులను ప్రకటించుకునే వెసులుబాటు కూడా లేకపోగా బీజేపీలో పోటీచేసేందుకు అభ్యర్థుల్లేక తలలు పట్టుకోవాల్సిన దుస్థితిని ఎదుర్కొంటున్నది. కాంగ్రెస్, బీజేపీలు ఒక రకంగా ఎన్నికల పోరు ముంగిట చేతులెత్తేశాయన్న చర్చ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సాగుతున్నది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో మొత్తం 9 నియోజకవర్గాలున్నాయి. ఇందులో ఎక్కడ చూసినా భారత రాష్ట్ర సమితికి గట్టి పోటీనిచ్చే నేతలెవ్వరూ కనిపించకపోవడంతో పోరు ఏకపక్షం అన్నట్లుగానే సాగుతున్నది. మరోవైపు అందరి కన్నా ముందుగానే సిట్టింగ్‌లకు సీట్లు ఖరారు చేసి ప్రచారాన్ని ఎన్నికల షెడ్యూల్‌కు ముందే ప్రకటించిన గులాబీ దళపతి ఒక రకంగా ప్రతిపక్ష పార్టీలకు సవాల్ విసిరినట్లు అయ్యింది. ప్రతిపక్ష పార్టీల కన్నా ముందుగానే బీఆర్ఎస్ అభ్యర్థులంతా ఆత్మీయ సమ్మేళనాలు, విభిన్న కార్యక్రమాలతో జనాల్లోకి వెళ్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలకు ఆ ఛాన్స్ లేకుండా పోయింది.
అభ్యర్థులే కరువు..
జాతీయ పార్టీలంటూ గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్, బీజేపీలకు అటు రాష్ట్రంలో, ఇటు ఉమ్మడి జిల్లాలో అభ్యర్థులే లేకపోవడంతో ఆగమాగం అవుతున్నాయి. అప్పటికప్పుడు ఇతర పార్టీల్లో అసంతృప్తితో రగిలిపోతున్న నేతలను పట్టుకొచ్చి టికెట్లు ఇప్పించుకునే పరిస్థితి కాంగ్రెస్, బీజేపీలకు ఎదురవుతున్నది. పారాచూట్ నేతల రాకతో సొంత పార్టీలోనూ ముసలం పెరుగుతుండడంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలో ఇంటి పోరును చల్లార్చేందుకు తలలు పట్టుకుంటున్నాయి. ఇలా పలు విధాలుగా సతమతం అవుతూ ఓ వైపు పోటీకి అభ్యర్థులే దొరకకపోవడంతో జాతీయ పార్టీల నేతలు నిట్టూర్చే పరిస్థితి వచ్చిందంటే అతిశయోక్తి కాదు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకు అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ ప్రకటించలేదు. సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి నియోజకవర్గంపై పీటముడి వీడడం లేదు. కేసీఆర్‌పై పోటీ చేసేందుకు స్థానిక నాయకులు చేతులెత్తేయడంతో హస్తం పార్టీ దిక్కుతోచని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నది. జుక్కల్‌లోనూ ఇదే దుస్థితి ఉన్నది. నిజామాబాద్ జిల్లాలో బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, బోధన్‌లో అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించినప్పటికీ ఇందులో బోధన్, నిజామాబాద్ రూరల్ మినహా మిగిలిన చోట్ల అంతా పార్టీ మారి వచ్చిన వారే ఉన్నారు. ఇక్కడ బీఆర్ఎస్కు పోటీనిచ్చే నేతలే లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ పారాచూట్ నేతలను చేరదీసుకొని కండువా కప్పి టికెట్లు ఇచ్చుకునే పరిస్థితి ఎదురైంది. అచ్చంగా ఇలాంటి దుస్థితే బీజేపీని వెంటాడుతున్నది. ఎల్లారెడ్డిలో అభ్యర్థి లేక ఇబ్బంది పడాల్సి వస్తున్నదంటే బీజేపీ దుస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక బాన్సువాడలోనూ అభ్యర్థులే కరువవ్వడంతో నిజామాబాద్ అర్బన్‌కు చెందిన వారిని సర్దుబాటు చేసుకొని పరువు నిలుపుకోవాల్సి వచ్చిందని బీజేపీ వర్గీయులే చెప్పుకుంటున్నారు.
సభలతో బీఆర్ఎస్ ధూం..ధాం..
గులాబీ బాస్ కేసీఆర్ మాత్రం ప్రచారంలో దూకుడు పెంచారు. రాష్ట్ర వ్యాప్తంగా హెలికాప్టర్లో సుడిగాలి పర్యటన చేస్తూ ఎన్నికల ప్రచారంలో ముందున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లా లో ఇప్పటికే నాలుగు నియోజకవర్గాల్లో కేసీఆర్ ప్రచార సభలు ముగియగా నవంబర్ 9న కామారెడ్డిలోనూ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించబోతున్నా రు. మిగిలిన నాలుగు నియోజకవర్గాల్లో ఈ నెల 15, 16 తేదీల్లో కేసీఆర్ సభలు నిర్వహించ నున్నారు. జుక్కల్, బాన్సువాడ, బాల్కొం డ, ఆర్మూర్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలు దిగ్విజయం కావడంతో అదే స్ఫూర్తితో మిగిలిన నియోజకవర్గాల్లోనూ కేసీఆర్ సభలను విజయవంతం చేసే దిశగా నేతలంతా సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్, బీజేపీకి చెందిన స్టార్ క్యాంపెయినర్ల జాబితా వెల్లడైనప్పటికీ వారంతా కనీసం జనాల్లోకి వచ్చి ఓట్లు అడిగే పరిస్థితి కూడా లేకుండా పోయింది. గత నెలలో రాహుల్ గాంధీ ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో తిరిగినప్పటికీ కనీసం హస్తం పార్టీలో జోష్ అన్నదే కనిపించడం లేదు. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం నిజామాబాద్ గడ్డపై అధికారిక కార్యక్రమం పేరుతో బీజేపీ సభకు హాజరైనప్పటికీ కాషాయ పార్టీలో ఆనందమే లేకుండా పోయింది. మోదీ, రాహుల్ కార్యక్రమాలతో ఆ రెండు పార్టీలకు కనీసం మైలేజ్ కూడా రాకపోవడంతో జనాలంతా బీఆర్ఎస్ పార్టీవైపే మొగ్గు చూపుతున్నట్లుగా స్పష్టమవుతున్నది.