కామారెడ్డి,మే 15: మహిళా వైద్య సిబ్బందిని లైంగికంగా వేధించిన వ్యవహారంలో కామారెడ్డి డీఎంహెచ్‌వో లక్ష్మణ్‌సింగ్‌పై దేవునిపల్లి పోలీసుస్టేషన్లో బుధవారం ఐదు కేసులు నమోదయ్యాయి. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు డీఎంహెచ్‌వోను అదుపులోకి తీసుకుని విచారించనున్నట్లు తెలిసింది. లైంగిక వేధింపుల వ్యవహారంలో లక్ష్మణ్‌సింగ్‌పై ఇప్పటికే శాఖాపరమైన విచారణ కొనసాగుతున్నది. తమతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని, లైంగికంగా వేధిస్తున్నాడని 20 మంది మహిళా మెడికల్ ఆఫీసర్లు ఇటీవల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో రాష్ట్ర వైద్యాధికారి అమర్‌సింగ్ నాయక్ బుధవారం స్థానిక ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి సమక్షంలో బాధిత వైద్య సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు.
డీఎంహెచ్‌వోగా వచ్చిన లక్ష్మణ్‌సింగ్ వైద్యశాఖను గాడిలో పెడుతున్నారనే భావన కలిగించారు. అయితే, తనిఖీల పేరుతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వస్తూ వక్రబుద్ధి ప్రదర్శించడం ప్రారంభించాడు. పీహెచ్‌సీలకు వెళ్లి అక్కడి మహిళా ఉద్యోగులతో అసభ్యంగా ప్రవర్తించడం, పక్కనే కూర్చోవాలని ఒత్తిడి చేయడం, ఫోన్లో అనుచితమైన పదాలతో మాట్లాడడం వంటివి చేస్తుండడంతో ఉద్యోగులు వారిలో వారు కుమిలి పోయారు. వైవాహిక స్థితిగతులను అడగడం, శారీరకంగా తాకడం వంటివి చేస్తుండడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమయ్యారు. ఎవరైనా ఎదురుతిరిగితే కక్షగట్టి అందరి ముందు గట్టిగా అరవడం, అవమానించడం వంటివి చేస్తుండడంతో మహిళా వైద్యాధికారులు విధులకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. చివరకు ధైర్యం తెచ్చుకుని సాక్ష్యాధారాలు సేకరించి ఉన్నతాధికారులకు దృష్టికి ఇటీవల తీసుకెళ్లారు. కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, ఎస్పీ సింధుశర్మతో పాటు వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో వైద్యారోగ్య శాఖ విచారణకు ఆదేశించింది.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డాక్టర్ అమర్‌సింగ్ నాయక్ బుధవారం జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్‌వో కార్యాలయానికి వచ్చి విచారణ చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి సమక్షంలో మహిళా మెడికల్ ఆఫీసర్లు తమ గోడు వెల్లబోసుకున్నారు. తమను ఏవిధంగా ఇబ్బంది పెట్టింది వివరించారు. తనిఖీల పేరిట వచ్చి అసభ్యకరంగా తాకడం, ఒడిలో కూర్చోవాలని ఒత్తిడి చేయడం వంటివి చేసేవాడని వాపోయారు. ఏడాదిన్నర కాలంగా తమతో అనుచితంగా ప్రవర్తిస్తున్నాడని, శారీరకంగా తాకుతూ ఇబ్బందులు పెడుతున్నాడని, ఫోన్లలో అసభ్యంగా మాట్లాడుతున్నాడని తెలిపారు. తన చాంబర్‌కు వెళ్తే అసభ్యకరంగా వ్యవహరించే వాడని, పురుషుల ముందు తమ అందం గురించి మాట్లాడేవారని వివరించారు. మూడు గంటల పాటు సాగిన విచారణ అనంతరం బాధిత ఉద్యోగులు దేవునిపల్లి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో వివిధ సెక్షన్ల కింద ఐదు కేసులు నమోదు చేసిన పోలీసులు డీఎంహెచ్‌వో లక్ష్మణ్‌సింగ్‌ను అదుపులోకి తీసుకోనున్నట్లు తెలిసింది.