Sarangapur | సారంగాపూర్, ఏప్రిల్ 5 : నిజామాబాద్ రూరల్ మండలంలోని మాధవ నగర్ గ్రామ నిరుపేద నివాసి రామస్వామి కామయ్యకు చెందిన ఐదు గేదెలు విద్యుదా ఘాతానికి గురై అక్కడికక్కడే అవి మృత్యువాత పడ్డాయి. బాధితుడి కథనం ప్రకారం… కామయ్య పాడి గేదెల పెంపకంపై ఆధారపడి తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గత కొన్నెండ్ల నుంచి ఒక గేదెను పెంపకం చేసి తద్వారా పాలు విక్రయించగా వచ్చిన డబ్బులు జమచేసుకుంటూ ఇలా ఐదు గేదెలను కొనుగోలు చేసుకున్నాడు. గేదెల పెంపకంలో తనకు తన భార్య, కొడుకు కూడా చేదోడువాదోడుగా ఉంటూ ముగ్గురు కలిసి కష్టపడి పాల వ్యాపారంపై ఆధారపడుతూ జీవనం సాగిస్తున్నారు.
వీరికి గుంటభూమి లేదు. ఇలా పాల వ్యాపారం తమను ఆర్థికంగా త్వరితగతిన బలపడేందుకు ఎంతగానో తోడ్పాటు అందిస్తున్న తరుణంలో శనివారం అర్ధరాత్రి వేళ కురిసిన అకాల వర్షంతో పాటు వీచిన బలమైన ఈదురు గాలులకు సమీపంలో ఉన్న ఒక చెట్టు కూలి విద్యుత్ స్తంభంపై పడింది. దీంతో స్తంభం విరిగి విద్యుత్ వైర్లు ఇంటివద్ద కట్టేసి ఉంచిన ఐదు గేదెలపై పడడంతో తద్వారా విద్యుదా ఘాతానికి గురై ఆ మూగ జీవాలు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన చూసిన కామయ్య అతడి కుటుంబీకుల గుండెల్లో పిడుగుపడినట్లు ఒక్కసారిగా ఉలిక్కిపడి నట్లయింది. మృతిచెందిన గేదెలను చూసిన వారు కన్నీటిపర్యంతమయ్యారు.
కొన్నేండ్లుగా ముగ్గురం కలిసి ఐదు గేదెలను పెంపకం కోసం కష్టపడుతూ వస్తున్నామని, ఇలాంటి పరిస్థితుల్లో అకస్మాత్తుగా ప్రకృతి బీభత్సం వల్ల కరెంటు వైర్లు తెగిపడిన కారణంగా సుమారు రూ.ఆరులక్షల విలువైన ఆస్తి నష్టం జరిగిందని బాధిత కుటుంబీకులు కన్నీరు మున్నీరై లబోదిబో మంటూ వాపోతున్నారు. ఈ ఘటన సమాచారం తెలుసుకొని విద్యుత్ శాఖ అధికారులు ఆదివారం సంఘటనా స్థలానికి చేరుకుని మృత్యువాత పడిన గేదెలను పరిశీలించారు.
మృతిచెందిన ఐదు గేదెలు కూడా చూడు గట్టాయని త్వరలోనే అవి ఈనే అవకాశం ఉండేవని వాపోయారు. మా బతుకు అంతా గేదెల పెంపకంపైనే ఉండగా ఇలా ఘోరం జరిగిపోయినందున ఆర్థికంగా చాలా నష్టపోయామని, ప్రభుత్వం నుంచి సాయం అందించి ఆదుకోవాలని బాధితులు అధికారులకు వేడుకుంటున్నారు.