స్వరాష్ట్రంలో కులవృత్తులకు పూర్వవైభవం వచ్చిందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సీఎం కేసీఆర్ పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేశ్‌గుప్తాతో కలిసి గురువారం నిజామాబాద్‌రూరల్, అర్బన్ నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. న్యాల్కల్ మాసానిచెరువులో చేప పిల్లలను విడుదల చేశారు.
ఖలీల్‌వాడి/ డిచ్పల్లి, సెప్టెంబర్ 14 : స్వరాష్ట్రంలో కులవృత్తులకు ప్రోత్సాహం లభిస్తున్నదని రాష్ట్ర పశు సంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో నీలి విప్లవం విజయవంతమైందని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని అర్సపల్లిలో రూ.2కోట్లు, డిచ్పల్లి మండలం నడిపల్లిలో రూ. 50లక్షలతో చేపడుతున్న చేపల మార్కెట్ల నిర్మాణ పనులకు గురువారం ఆయన శంకుస్థాపన చేశారు.మోపాల్ మండలం న్యాల్కల్ గ్రామంలోని మాసాని చెరువులో ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేశ్‌గుప్తా, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతుతో కలిసి చేప పిల్లలను విడుదల చేశారు. అనంతరం మత్స్యకార్మిక సంఘాల సభ్యులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సమైక్య రాష్ట్రంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన మత్స్య కార్మికులను.. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్ని విధాలుగా ఆదుకుంటున్నారని తెలిపారు. నీటి వనరులున్న ప్రతిచోట వంద శాతం సబ్సిడీపై చేపలు, రొయ్యల పెంపకానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో మత్స్య సంపద గణనీయంగా వృద్ధి చెందిందన్నారు. ఈ నేపథ్యంలో మంచి మార్కెటింగ్ వసతితో మత్స్యకార కుటుంబాలకు మరింత ఆర్థిక పరిపుష్టి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అవకాశమున్న ప్రతిచోట జిల్లా, మండల స్థాయిల్లో హోల్‌సేల్, రిటైల్ మార్కెట్లను ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు. 75శాతం సబ్సిడీపై ఫోర్‌వీలర్ వాహనాలు, మోపెడ్లు, లగేజీ ఆటో రిక్షాలు సమకూరుస్తోందన్నారు. చేపలకు మంచి డిమాండ్ పలుకుతుండడంతో మత్స్యకారులు అధిక ఆదాయం ఆర్జిస్తున్నారని తెలిపారు. ఈ దిశగా మహిళలకు కూడా ఆదాయ వనరులు సమకూరేలా ప్రత్యేకంగా కృషి చేస్తున్నామన్నారు.
18 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరికీ మత్స్యకార్మిక సంఘాల్లో సభ్యత్వం కల్పిస్తున్నామన్నారు. ఇదివరకు జీపీ ద్వారా సర్పంచులు లైసెన్స్‌లు జారీ చేసే విధానాన్ని తొలగించి, కేవలం మత్స్యకారులకు మాత్రమే మత్స్యశాఖ ద్వారా లైసెన్స్‌లు ఇచ్చేలా ప్రభుత్వం జీవో జారీ చేసిందని తెలిపారు. దళారి వ్యవస్థను పూర్తిగా రూపుమాపి చెరువులు, జలాశయాల్లో చేపల సంపదపై పూర్తిగా మత్స్య కార్మికులకే హక్కులు కల్పించామన్నారు. ప్రభుత్వం రాష్ట్రంలో చేపల సంపదను రెట్టింపు చేసి మత్స్యకార కుటుంబాల్లో వెలుగులు నింపుతోందన్నారు.
అర్బన్ ఎమ్మెల్యే బిగాల మాట్లాడుతూ నగరంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. సమీకృత వెజ్, నాన్‌వెజ్ మార్కెట్లు నిర్మాణంలో ఉన్నాయన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన అనేక కార్యక్రమాలతో మత్స్య సంపద గణనీయంగా పెరిగిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ ద్వారా చెరువులు నిండుకుండల్లా మారాయని, సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు, మత్స్యకారులకు వరంగా మారాయని తెలిపారు. నగరంలో చేపల మార్కెట్ అందుబాటులోకి వస్తే మత్స్యకారులకు ఉపాధి లభించడంతో పాటు నగర ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. సాధ్యమైనంత త్వరలోనే చేపల మార్కెట్‌ను ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు.
తెలంగాణ ఏర్పడక ముందు చెరువులన్నీ కబ్జాకు గురయ్యాయని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మత్స్య పారిశ్రామిక కార్మికులు చేపలు పట్టుకుందామంటే చెరువులే లేకుండా పోయాయన్నారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాలతో చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతున్నాయన్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను మరమ్మతులు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. చెరువుల ద్వారా ప్రతిఒక్క మత్స్యకారుడు లబ్ధిపొందుతున్నాడని తెలిపారు. కులవృత్తులను ప్రోత్సహించడానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. మత్స్యకారులకు వంద శాతం సబ్సిడీపై చేప పిల్లలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
నిజామబాద్ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు మాట్లాడుతూ జిల్లాలో 1118 చెరువుల్లో చేప పిల్లలను విడుదల చేస్తూ మత్స్య సంపదను పెంపొందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. ఎస్సారెస్పీలో చేపలు, రొయ్యల పెంపకం చేపట్టినట్లు చెప్పారు. ఈ సందర్భంగా రూరల్ నియోజకవర్గంలో సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా 20 ద్విచక్ర వాహనాలు, 75 శాతం రాయితీపై రూ.11.55 లక్షల విలువ చేసే లగేజీ ఆటో రిక్షాలను మంత్రి తలసాని చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. న్యాల్కల్లోని మాసాని చెరువులో 2.74 లక్షల చేప , 1.37 లక్షల రొయ్య పిల్లలు విడుదల చేశారు.