Nizamabad | వినాయక నగర్, ఏప్రిల్, 20 అగ్ని ప్రమాదాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండడంతో పాటు అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం సంభవిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగి ఉండాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య సూచించారు. అగ్నిమాపక వారోత్సవాలు ముగింపు సందర్భంగా నిజామాబాద్ ఫైర్ స్టేషన్ లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమానికి సిపి హాజరయ్యారు.
ముందుగా ఆయనకు ఫైర్ అధికారులు, సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఫైర్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటుచేసిన ఫైర్ ఎక్విప్మెంట్లను పరిశీలించి, వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అగ్ని ప్రమాదం అనుకోకుండా ఎప్పుడైనా ఇంట్లో కాని, లేదా వ్యాపార సంస్థల్లో కానీ, జన రద్దీ ఉన్న ప్రదేశాల్లో కానీ జరిగినప్పుడు ఆ ప్రమాదాలను నియంత్రించేందుకు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అగ్నిమాపక సిబ్బంది కృషి చేస్తారని వారి సేవలను ఆయన కొనియాడారు.
అగ్ని ప్రమాదం జరిగినప్పుడు సిబ్బంది ఎంతో సాహసంతో ప్రమాదాలలో చిక్కుకున్న వారి ప్రాణాలతో పాటు కోట్లాది రూపాయల ఆస్తులను సైతం కాపాడిన సంఘటనలు ఎన్నో ఉన్నాయని ఈ సందర్భంగా సీపీ గుర్తు చేశారు. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లలో వ్యాపార సముదాయాల్లో ఫైర్ సేఫ్టీ మెజర్స్ తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. అనంతరం వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు సీపీ చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేశారు. పదవీ విరమణ చేసిన ఫైర్స్ సిబ్బందిని సిపి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఓ నర్సింగ్ రావు తో పాటు లీడింగ్ ఫైర్ మెన్స్, డ్రైవర్ ఆపరేటర్, ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు.