నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలోని (Nizamabad) ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి నాగ్‌పూర్ వెల్తున్న లారీ దగ్ధమైంది. డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. హైవేపై పెద్దగా రద్దీ లేని సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో ప్రాణ నష్టం తప్పింది.
హైదరాబాద్ నుంచి ఓ కంటైనర్ లారీ నాగ్‌పూర్ వెళ్తున్నది. ఈ క్రమంలో సోమవారం ఉదయం 8.20 గంటల సమయంలో నిజామాబాద్‌లోని ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద లారీ ఆగింది. డీజిల్ ట్యాంకర్ నుంచి మరో ట్యాంకర్‌లోకి డీజిల్ మారుస్తుండగా, ఒక్కసారిగా మంటలు చెలేగాయి. దీంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడటంతో లారీకి నిప్పంటుకున్నది. వెంటనే స్పందించిన టోల్‌ప్లాజా సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.