కామారెడ్డి/ కంఠేశ్వర్, జూలై 12 : విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలో శుక్రవారం ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ వద్ద ప్లేట్లు పట్టుకొని నిరసన తెలుపగా, కామారెడ్డిలో కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ.. స్కాలర్షిప్స్ రాక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలవుతున్నా ఉపకార వేతనాలను విడుదల చేయడంతో నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి రూ.200 కోట్లు పెండింగ్ బకాయిలు ఉన్నాయని తెలిపారు.
పేదవిద్యార్థులు ఫీజులు చెల్లించలేక తమ సర్టిఫికెట్లను కళాశాలల్లోనే వదిలేసి చదువులకు స్వస్తి చెప్పి, ప్రైవేట్ ఉద్యోగాల వైపు వెళ్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే పెండింగ్‌లో ఉన్న బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. కామారెడ్డిలో చేపట్టిన కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు అరుణ్, కార్యదర్శి అజయ్, ఉపాధ్యక్షుడు మణికంఠ, నాయకులు రాహుల్, నితిన్, రాఘవ, ప్రభు, అర్జున్, సాయి, నిజామాబాద్‌లో ధర్నా నిర్వహించిన అనంతరం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాచకోండ విఘ్నేశ్, సహాయ కార్యదర్శి దీపిక, నాయకులు విశాల్, సతీశ్, రాజు, ఆజాద్ తదితరులు పాల్గొన్నారు.