Murder | వినాయక నగర్, జూన్ 19 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ హృదయ విధారకమైన ఘటన శుక్రవారం వెలుగు చూసింది. భార్యపై అనుమానం పెంచుకున్న ఓ కసాయి భర్త తమకు పుట్టిన బాబును ఆ బాబు తనకు పుట్టలేదని మనసులో కసి పెంచుకున్న తండ్రి కన్నతల్లి చెంతన ఉన్న ముక్కుపచ్చలారని మూడు నెలల బాలుడిని కన్నతండ్రి కత్తితో పొడిచి అతి దారుణంగా హతమార్చాడు. తన రక్తం పంచుకొని పుట్టిన మూడు నెలల బాబుని అతి కిరాతకంగా హత్య చేసిన భర్త పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆ తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులు పేర్కొంది. నిజామాబాద్ ఒకటో టౌన్ ఎస్హెచ్వో రఘుపతి కథనం ప్రకారం.. నగరంలోని అశోక్ నగర్ ప్రాంతంలో నివాసం ఉండే బద్రే ప్రియాంక, ఆమె భర్త యువరాజు కు మూడు నెలల బాబు ఉన్నాడు.
అయితే తన భర్త యువరాజు, తమ మూడు నెలల బిడ్డను తీసుకొని కనిపించకుండా పోయాడని బాధితురాలు గురువారం ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టగా శుక్రవారం యువరాజును అదుపులోకి తీసుకొని విచారించారు. తన భార్యపై అనుమానం పెంచుకొని, తమ మూడు నెలల బాబు తనకు జన్మించిన సంతానం కాదని అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఆ బాబును తీసుకొని నిజామాబాద్ నగరంలోని రైల్వే ట్రాక్ సమీపంలో నిర్మానుష్యమైన ప్రదేశానికి వెళ్లి ఆయుధంతో పసిబిడ్డను హత్య చేసి మృతదేహాన్ని అక్కడే ముళ్ల పొదల్లో దాచిపెట్టినట్లు నిందితుడు యువరాజు అంగీకరించాడు. నిందితుడు చూపించిన ప్రదేశంలో పసిబిడ్డ మృతదేహాన్ని గుర్తించి జిల్లా ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించినట్లు, నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్హెచ్ఓ రఘుపతి పేర్కొన్నారు.