ఎండలు ముదురుతున్నాయి.. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి.. బోర్లు ఎత్తిపోతుండగా, పైర్లు నేలచూపులు చూస్తున్నాయి.. కళ్ల ముందే పంట పొలాలు నెర్రెలు వారుతుంటే, రైతుల కంట కన్నీళ్లు ఉప్పొంగుతున్నాయి.. ఏపుగా ఎదిగిన వరి పైరును కాపాడుకునేందుకు అన్నదాతలకు ట్యాంకర్లే దిక్కయ్యాయి. ఎండాకాలం ఆరంభానికి ముందే పలు చోట్ల ఈ పరిస్థితులు తలెత్తడంతో పంటలు చేతకందుతాయా? అన్న భయాలు అన్నదాతలను వెంటాడుతున్నాయి.
భీమ్గల్, మార్చి 6: పాతాళ గంగమ్మ రోజురోజుకూ అడుగంటుతున్నది. వేసవి ఎండలు మొదలైన తరుణంలో భూగర్భ జలాలు వేగంగా కిందకు వెళ్తున్నాయి. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో నీటి ఇక్కట్లు తలెత్తుతున్నాయి. చాలాచోట్ల వరి పైర్లు ప్రస్తుతం పొట్ట దశలో ఉన్నాయి. అయితే, బోర్లు ఎత్తిపోతుండడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. పంటలను కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. కొందరు ట్యాంకర్ల ద్వారా పంటలకు నీరు పెడుతుండగా, మరికొందరు కొత్తగా బోర్లు తవ్విస్తున్నారు.
వరి అధికంగా పండించే భీమ్గల్ మండలంలో అక్కడక్కడ నీటి ఇబ్బందులు మొదలయ్యాయి. ఇక్కడ దాదాపు రైతులంతా బోర్లపైనే ఆధారపడి సాగు చేస్తున్నారు. ఇతరత్రా ప్రత్యామ్నాయ నీటి వసతులు లేవు. దీంతో అనాధిగా బోర్లపైనే ఆధారపడి పంటలు పండిస్తున్నారు. భీమ్గల్ మండలంలో వర్షాకాలంలో 34 వేల ఎకరాల్లో వరి సాగు కాగా, యాసంగిలో 31 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. పురాణీపేట్, పల్లికొండ, బాచన్పల్లి, పిప్రి తదితర గ్రామాలలో మరో 15-20 రోజులు గడిస్తే పంటలు గట్టెక్కే పరిస్థితి ఉంది. ఆలస్యంగా వరి నాట్లు వేసిన ప్రాంతాల్లో ఏప్రిల్ మొదటివారం వరకూ నీరందించాల్సిన పరిస్థితి నెలకొంది. డబ్బులు ధారపోస్తూ..
ఎలాగోలా యాసంగి పంటలు గట్టెకుతాయనుకున్న తరుణంలో భూగర్భ జలాలు పాతాళానికి చేరవడం రైతాంగాన్ని కలవరపెడుతున్నది. ప్రస్తుతం వరి పొట్ట దశకు చేరుకున్న కీలక సమయంలో భూగర్భ జలాలు అడుగుతుండడం అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తున్నది. ఇప్పటికే చాలాచోట్ల బోర్లు ఎత్తిపోయాయి. కండ్ల ముందే పైర్లు నేలచూపులు చూస్తుండడంతో దిక్కతోచని స్థితిలో రైతులు తల్లడిల్లుతున్నారు. మరో నెల రోజుల్లో పంట కోతకు వచ్చే దశలో ఏర్పడిన నీటి ఎద్దడిని చూసి అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో పంటలు కాపాడుకునేందుకు భారీగా ఖర్చు చేస్తున్నారు. కొందరు రైతులు ట్యాంకర్ల ద్వారా తడులు అందిస్తున్నారు. మరికొందరేమో రూ.లక్షలు వెచ్చిస్తూ కొత్త బోర్లు తవ్విస్తున్నారు.
పొలంలో బోరు వట్టిపోయింది. పొలం పొట్ట దశకు వచ్చింది. నీరు అందడం లేదు. గత్యంతరం లేక మరో బోరు వేయించాల్సి వచ్చింది. ఈ సీజను ఎలా గట్టెక్కుతుందో ఏమో. ఎండలు చూస్తే విపరీతంగా ఉన్నాయి. భూగర్భ జలాల పరిస్థితి కూడా బాగోలేదు.
-మంద ఇమ్మాన్యుయేల్, రైతు, బాబానగర్, భీమ్గల్