నిజామాబాద్, జనవరి 23, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రైతు భరోసా కోసం రైతులు ఎదురు చూపులకే పరిమితం అవుతున్నారు. యాసంగి పంట కాలం మొదలైనప్పటికీ పెట్టుబడి సాయం మంజూరుపై స్పష్టత కరువైంది. ఇంకెప్పుడు పెట్టుబడి సాయం ఇస్తారు? అంటూ రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే మంత్రులు, ఎమ్మెల్యేల దాకా పూటకొకరు ఇష్టమొచ్చిన ప్రకటనలు చేస్తున్నారు. వివిధ సామాజిక మాధ్యమాల్లో లీకులు ఇచ్చి రైతుభరోసా రేపో మాపో ఇస్తామంటూ ఇష్టానుసారంగా ప్రచారం చేస్తున్నారు. తీరా చూస్తే సంక్రాంతి పండుగ వచ్చినప్పటికీ పెట్టుబడి సాయానికి దిక్కూ మొక్కూ లేకుండా పోయింది.
నిజామాబాద్ జిల్లాలో గత వానాకాలం సీజన్లో 2లక్షల 60వేల 617 మంది రైతులకు రూ.231.18కోట్లు చెల్లింపులు జరిపారు. కామారెడ్డి జిల్లాలో గత వానాకాలంలో 2లక్షల 96వేల 452 మంది రైతులకు రైతుభరోసా పథకం కింద ఎకరానికి రూ.6వేలు చొప్పున రూ.247.70కోట్లు చెల్లింపులు జరిపారు. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో 5లక్షల 56వేల మంది రైతులకు పెట్టుబడి సాయం అందాల్సి ఉంది. సమయానికి రైతుభరోసా రాకపోవడంతో రైతులంతా అప్పుల కోసం తిప్పలు పడుతున్నారు. ఉద్దెరకు ఎరువులు, విత్తనాలు తెచ్చుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యవసాయ సలహాదారుగా పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆరు గ్యారంటీల అమలు కోసం ప్రభుత్వ సలహాదారుగా పి.సుదర్శన్ రెడ్డి ఉన్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందని రైతులు అంటున్నారు.
రైతులకు మేలు తలపెట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి, బీఆర్ఎస్ సర్కార్కు స్పష్టమైన తేడా కనిపిస్తోంది. పదేళ్ల కేసీఆర్ పాలనలో రైతులు ఏనాడు రోడ్డు ఎక్కలేదు. ఎరువులు, విత్తనాల కోసం ఎదురు చూడలేదు. సాగు నీళ్లు, వ్యవసాయానికి నిరంతర కరెంట్, పెట్టుబడి సాయం, రైతు బీమా వంటి అనేక విప్లవాత్మకమైన పథకాలు అద్భుతంగా అమలుకు నోచుకున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచే రైతుబంధు పథకానికి కటకట మొదలైంది. రైతుభరోసా పేరుతో ఎకరానికి ఏటా రూ.15వేలు సాయం అందిస్తామని కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్లో పేర్కొంది.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఎకరానికి రూ.15వేలు పక్కన పెట్టి రూ.12వేలుతో సరిపెట్టారు. ఎకరానికి రూ.3వేలు చొప్పున ప్రతి రైతుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాకీ పడింది. ప్రస్తుతం రైతులను పట్టించుకునే నాథుడే లేడన్నట్లుగా పరిస్థితి దాపురించింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో మొత్తం 10లక్షల 48వేల ఎకరాలకు గతంలో రైతుబంధు పథకం వర్తించింది. అన్ని వర్గాలకు సమానంగా పెట్టుబడి సాయం అందించారు. బ్యాంకుల చుట్టూత రైతులు తిరిగే పరిస్థితి లేకుండా మధ్యవర్తులకు ఆస్కారం లేకుండా ఆన్లైన్ పద్ధతిలో నేరుగా డబ్బులు జమ చేసే విధంగా కేసీఆర్ ప్రభుత్వం ఈ పథకాన్ని డిజైన్ చేసింది. అత్యంత పారదర్శకంగా రైతుబంధు పథకాన్ని అమలు చేసి చూపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత పెట్టుబడి సాయం అతీగతీ లేకుండా పోయింది. రెండేళ్ల కాలంలో ఐదు పంట కాలాలు వచ్చాయి. ఇందులో అరకొరగానే రైతు భరోసా పథకాన్ని అమలు చేశారు. గత వానాకాలం సీజన్లో పూర్తి స్థాయిలో పెట్టుబడి సాయాన్ని అందించారు. దీనికి ప్రధాన కారణంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉండటమేనని రైతులంతా అనుకుంటున్నారు. అంతకు మునుపు పార్లమెంట్ ఎన్నికల సమయంలోనూ రైతుభరోసాను తూతూ మంత్రంగా అమలు చేసి చేతులు దులుపుకున్నారు. ప్రస్తుతం యాసంగి సీజన్ ప్రారంభమైంది. సాగు పనుల్లో రైతులు తలామునకలయ్యారు. ఠంచనుగా పెట్టుబడి సాయాన్ని అందిస్తే రైతులకు ఎంతో ఉపయుక్తం అయ్యేది.
రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో నిర్లక్ష్యం తాండవిస్తోంది. కొద్ది రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ దశలో గ్రామాల్లో వ్యవసాయ భూములున్న వారిలో చాలా మందికి పట్టణాల్లో ఓటు హక్కు ఉంది. ఓటర్లను ప్రభావితం చేసేందుకు సంక్రాంతి పండుగకు రైతుభరోసా డబ్బులు విడుదల చేస్తారని మొన్నటి వరకు ప్రచారం జరిగింది. కానిప్పుడు అకస్మాత్తుగా ఆ ఊసే కరువైంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపే పెట్టుబడి సాయం వస్తుందనే ఆశతో రైతులు ఎదురు చూస్తున్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వ పాలనలో ఇలాంటి దుస్థితి కనిపించలేదు. సాగు కాలం షురూ అవ్వగానే కర్షకుల బ్యాంక్ ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ అయ్యేవి.
కోటగిరి, జనవరి 23: రైతుభరోసాపై ఇప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన లేదు. యాసంగి వరి పంట సీజన్ ప్రారంభమైంది. మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసింది.బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పంట పెట్టుబడి సాయం సమయానికి వచ్చేది.ఫోన్ టింగు టింగుమని మోగేది. రేవంత్రెడ్డి సర్కారు వచ్చినప్పటి నుంచి రైతుభరోసా ఊసేలేదు. మాకు ఒక్క సారి కూడా సాయం అందలేదు.
-దిలీప్పటేల్, రైతు, ఎత్తొండ, కోటగిరి మండలం
కాంగ్రెస్ ప్రభుత్వం రైతుభరోసా కింద ఎకరానికి రూ. 15 వేలకు బదులు రూ. 12 వేలు ఇస్తానని చెప్పింది. కానీ అది ఎక్కడ కూడా సక్కగా ఇస్తలేరు. రెండేండ్ల కాలంలో నాలుగు విడుతలుగా చెల్లించాల్సిన రైతుభరోసా ఒక్కసారి కూడా అమలు చేయలేదు. ఎత్తొండ శివారులో నాకు మూడెకరాల వ్యవసాయం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి సమాయానికి రైతుభరోసా ఇవ్వలేదు. కేసీఆర్ సారు ఉండగా పెట్టుబడి సాయం సమయానికి పడేది. ఆయన ఉండగా రైతులకు అన్ని రకాలుగా బాగుండే.
– నాగలక్ష్మి, రైతు, ఎత్తొండ క్యాంప్ కోటగిరి మండలం