పెద్దకొడప్గల్/ రాజంపేట, సెప్టెంబర్ 3: రైతులకు సరిపడా యూరియా అందించాలని పెద్ద కొడప్గల్ గ్రామ భారతీయ కిసాన్ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బుధవారం ధర్నా నిర్వహించారు. ‘గణపతి బప్పా మోరియా.. కావాలయ్య యూరియా’ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా భారతీయ కిసాన్ సంఘం అధ్యక్షుడు కుమార్ సింగ్ మాట్లాడుతూ..వరి పంట సాగు చేస్తున్న రైతులకు యూరియా అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
రైతులకు యూరియా అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. రైతుల కష్టాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సొసైటీ, ఫర్టిలైజర్ దుకాణాల చుట్టూ తిరుగుతూ అలసిపోయిన రైతులు యూరియా కోసం రోడ్డెక్కి ధర్నా చేపట్టారని వివరించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు సరిపడా యూరియాను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం తహసీల్ కార్యాలయంలో నాయబ్ తహసీల్దార్ రవికాంత్కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘం సభ్యులు బోడి రాజు యాదవ్, బోడి మల్లికార్జున్ యాదవ్, ఆఫ్రోజ్, జైత్రం, దేవీసింగ్, రైతులు సంజీవ్ రెడ్డి, అంజయ్య, తానాజీరావు, గద్దునాయక్, ఏక్నాథ్, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.
వచ్చింది 240 బస్తాలు.. క్యూలో 400 మంది రైతులు
రాజంపేటమండల కేంద్రంలోని సొసైటీకి యూరియా వచ్చిందని తెలియడంతో బుధవారం ఉదయం 8 గంటల నుంచే రైతులు బారులు తీరారు. కేవలం 240 బస్తాల యూరియా రాగా.. దాదాపు 400 మంది రైతులు క్యూలో నిల్చున్నారు. ఒక్కో పాస్ పుస్తకానికి ఒక బస్తా చొప్పున పంపిణీ చేయగా..వంద మంది రైతులు యూరియా అందక నిరాశతో వెనుదిరిగారు. యూరియా కోసం 15 రోజులుగా ఎదురుచూస్తున్నామని, సరిపడా యూరియా రాక తిరిగి వెళ్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
రామారెడ్డిలో రాత్రి వరకు పడిగాపులు
రామారెడ్డి, సెప్టెంబర్ 3: యూరియా వస్తుందని తెలిసిన మహిళలు రామారెడ్డి మండల కేంద్రంలోని సొసైటీ వద్ద బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు పడిగాపులు కాశారు. తీరా ఒకే లారీ లోడ్ రావడంతో పంపిణీ చేస్తారని రైతులు భావించారు. కానీ సొసైటీ సిబ్బంది వచ్చి గురువారం ఉదయం నుంచి రైతువేదికలో సీరియల్ నంబర్ ప్రకారం యూరియా అందజేస్తామని చల్లగా చెప్పడంతో రైతులు, మహిళలు నిరాశతో వెనుదిరిగారు.