Bhubharati | శక్కర్ నగర్ : భూ సమస్యల పరిష్కారానికి గాను నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ సూచించారు. బోధన్ పట్టణంలోని గ్రామచావిడిలో ప్రారంభించిన భూభారతి రెవెన్యూ సదస్సును ఆయన మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వపరంగా రైతుల సమస్యల పరిష్కారం కోసం ఈ సదస్సులను కొనసాగిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
పలువురు రైతుల సమస్యలపై వచ్చిన వినతిపత్రాలను ఆయన స్వయంగా స్వీకరించి వాటి పరిష్కారాలపై రైతులతో మాట్లాడారు. భూభారతి రెవెన్యూ సదస్సులో వస్తున్న ఫిర్యాదులు, వినతి పత్రాలు స్వీకరించి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటిని సత్వరమే పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను ఆయన ఆదేశించారు. సర్వే నెంబర్లలో తప్పులుంటే, పాస్ పుస్తకాల్లో పేర్ల మార్పిడి, వంశపారంపర్య మార్పిడి తదితర అంశాలపై దరఖాస్తులు చేసుకోవాలని ఆయన రైతులకు సూచించారు.
ఈ సదస్సులో వచ్చిన ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా చర్య చేపట్టాలని ఆయన స్థానిక తహసీల్దార్ విట్టల్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, బోధన్ తహసీల్దార్ విటల్, నాయకులు తూము శరత్ రెడ్డి, హరికాంత్ చారి, గుండేటి రాములు, రైతులు ఉన్నారు.