ధర్పల్లి, జూన్ 2: రుతుపవనాలు ముందుగానే పలుకరించడంతో అన్నదాత వానకాలం పంటల సాగుకు సిద్ధమవుతున్నాడు. భూములు దమ్ము చేసి వరి వేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. నారు మడులను ముందుగానే వేసుకున్న రైతులు.. నాటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. మ రోవైపు రైతులకు అన్ని విధాలుగా అండగా ఉండాల్సిన ప్రభుత్వం మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యహరిస్తు న్నది. పంటలు వేసే కాలం వచ్చినా.. ఇప్పటి వరకు రైతు భరోసాపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. సన్న వడ్లకు క్వింటాలుకు రూ. 500 చొప్పున బోనస్ ఇస్తామని చెప్పి న సర్కారు.. ధాన్యం కాంటా చేసి నెల రోజులు గడుస్తు న్నా, ఇప్పటి వరకు డబ్బులు మంజూరు చేయలేదు. ఈ తరుణంలో పంటలు సాగుచేసేది ఎలా అని రైతులు వాపోతున్నారు.
మిరుగు కంటే మునుపే వర్షాలు పలుకరించడంతో రైతులు ఓవైపు సంతోష పడుతున్నా.. చేతిలో డబ్బులు లేక పంట సాగు చేసేదెలా అని దిగులు చెందుతున్నారు. డబ్బుల కోసం మళ్లీ ఇతరుల వద్ద బాకీ తేవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నదని ఆవేదనకు లోనవుతున్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే రైతు భరోసా ఇ వ్వాలని, బోనస్ డబ్బులు మంజూరు చేయాలని అన్నదాతలు కోరుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హ యాంలో పంటలు సాగుచేయడానికి ముందే డబ్బులు రైతుల ఖాతాలో జమ చేసేవారు. సీజన్‌కు ముందే చేతిలో డబ్బు లు ఉండడంతో ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. వాన లు పడకముందే విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉంచుకునే వారు. సాగు కష్టాలు లేకుండా కేసీఆర్ అండగా నిలిచేవాడని రైతులు గుర్తు చేసుకుంటున్నారు.
రైతుభరోసాతోపాటు సన్నవడ్లకు బోనస్ డబ్బులు ఇంతవరకు అందలేదు. వానకాలంలో పంట వేయడం ఇబ్బందిగా మారింది. నాకైతే ఇంతవరకు రుణమాఫీ కూడా కాలేదు. రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని చెబుతున్న ప్రభుత్వం.. కేవలం ఆర్భాటాలు తప్ప చేసిందేమీ లేదు. ఇప్పటికైనా రైతుభరోసా, బోనస్ డబ్బులు త్వరగా ఇచ్చి రైతులను ఆదుకోవాలి.
జీలుగ విత్తనాల ధరను ప్రభుత్వం ఒకేసారి బస్తాకు రూ.2,137కు పెంచి విక్రయిస్తున్నారు. రైతులను ఆదుకోవాల్సిపోయి అదనంగా డబ్బులు దండుకుంటున్నారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారే తప్ప వారికి అండగా నిలువడం లేదు. ప్రభుత్వం వెంటనే బోనస్ డబ్బులు, రైతుభరోసాను అందించి.. వానాకాలం పంటలు సజావుగా సాగుచేసుకునేలా చూడాలి.
– విజయేందర్, రైతు, దుబ్బాక