యాసంగి పంట సేకరణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతులు దోపిడీకి గురువుతున్నారు. రైతులకు ఎలాంటి నష్టమూ వాటిల్లకుండా, ఇబ్బందులు కలుగుకుండా ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నట్లు ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉన్నది. పంటను అమ్ముకోవడానికి ధాన్యం తీసుకురాగా.. తరుగు పేరిట దోచుకుంటున్నారు. క్వింటాలు ధాన్యానికి సుమారు 5 నుంచి 6 కిలోల వరకు తరగు పేరిట అదనంగా ధాన్యం తీసుకుంటున్నారు. ఈ దోపిడీని నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో రైతులు మంగళవారం రోడ్డెక్కారు. స్థానిక తహసీల్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. తరుగు దోపిడీని నివారించాలంటూ ఆందోళన చేయడం.. ప్రభుత్వ యంత్రాంగంలోని లోపాలను ఎత్తిచూపినట్లయ్యింది.
-నిజామాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
యాసంగిలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేస్తున్నామని, కొనుగోలు కేంద్రాలను కూడా విరివిగా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వ పెద్దలు ఊదరగొడుతున్నారు. కానీ ధాన్యం రాకను అనుసరించి కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావడంలో ప్రభుత్వ యంత్రాంగంలో సమన్వయం పూర్తిగా లోపించింది. బస్తాకు అదనంగా రెండు కిలోలు చొప్పున ధాన్యాన్ని అదనంగా తూకం వేస్తున్నారు. లేదంటే కొనుగోళ్లకు ససేమిరా అంటున్నారు. ధాన్యం దోపిడీకి రైతులు ఒప్పుకోకపోతే బలవంతంగానైనా దోపిడీకి కేంద్రం నిర్వాహకులు పాల్పడుతున్నారు. వడ్లు పచ్చిగా ఉన్నాయంటూ కొర్రీలు పెడుతూ తూకం వేయడానికి సతాయిస్తున్నారని రైతులు వాపోతున్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైన తొలిరోజు నుంచే ఈ తరహా దందా వెలుగుచూడడం గమనార్హం.
బీఆర్ఎస్ హయాంలో ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా చేపట్టారు. యంత్రాంగాన్ని ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుండడంతోపాటు పొరపాట్లపై సమీక్షలు నిర్వహించేది. కానీ ఇప్పుడు అలాంటిదేమీ కనిపించడం లేదు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఎలాంటి ఫలితమూ లేకుండా పోయింది. ధాన్యం కొనుగోళ్లకు ముందు చుట్టపు చూపుగా వచ్చి వెళ్లిన జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు తిరిగి ఇటువైపు రాలేదు. ఉమ్మడి జిల్లాలో వడగండ్ల వాన, ఈదురు గాలులు, అకాల వర్షంతో పంట నష్టం సంభవించినప్పటికీ కనీసం ఆరా తీయకపోవడం గమనార్హం. కొనుగోళ్లు మొదలైనప్పటికీ ఉభయ జిల్లాలకు చెందిన యంత్రాంగంతో సమీక్షలు చేయకపోవడంతో ఈ తరహా లోపాలు బయట పడుతున్నాయి.
తరుగు దోపిడీకి రైస్ మిల్లర్లు సిండికేట్‌గా మారారు. అంతా కలిసి ఒక నిర్ణయం తీసుకుని రైతులను నిండా ముంచుతున్నారు. గతంలో మాదిరిగానే బహిరంగంగానే 40 కిలోల బస్తాకు 2 నుంచి నాలుగు కిలోల చొప్పున తరుగు రాబడుతున్నారు. ఈసారి సన్న వడ్ల సాగు 70 శాతం వరకు పెరిగింది. యాసంగిలో వచ్చే ధాన్యాన్ని మర ఆడిస్తే బియ్యంలో నూకలు ఎక్కువగా వస్తాయి. ఇదే సాకును బూచీగా చూపి రైస్ మిల్లర్లు దోపిడీకి తెగబడుతున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. మిల్లర్ల దయా దాక్షిణ్యాలపై ఆధారపడి రైతులకు చెల్లింపులు జరిగేలా వ్యవస్థ వేళ్లూనుకుపోయింది. కింటాలు ధాన్యానికి సుమారు 5 నుంచి 6 కిలోల వరకు తరుగు పేరిట పక్కాగా దోపిడీ జరుగుతున్నది.
దీంతో రైతులకు క్వింటాలుకు రూ.120 నుంచి రూ.150 వరకు నష్టం వాటిల్లుతున్నది. ఎకరం భూమి కలిగి ఉన్న రైతుకు దాదాపుగా రూ.3 వేల నుంచి రూ.4వేలు నష్ట పోవాల్సి వస్తున్నది. బాన్సువాడ, బోధన్, జుక్కల్ నియోజకవర్గాల్లో ఏటా అందరికన్నా ముందే కోతలు ప్రారంభిస్తారు. నిజాంసాగర్ ఆయకట్టు రైతుంలతా అందరికన్నా ముందుగానే పంటను విక్రయిస్తారు. ఇక్కడ మొదలైన దోపిడీ పర్వం ఏకంగా ధాన్యం కొనుగోళ్లు ముగిసేంత వరకు కొనసాగుతున్నది. ఈ దోపిడీ తంతు బహిరంగంగానే జరుగుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. ఇదేందని అడిగితే స్పందించే వారు కూడా లేకుండా పోయారు. కోటగిరి రైతుల ఆందోళనతో వెలుగు చూసిన రైస్ మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల దోపిడీకి చెక్‌పెట్టి కొనుగోళ్లను పారదర్శకంగా చేపట్టాలని కర్షకులు డిమాండ్ చేస్తున్నారు.