విజయ డెయిరీకి పాలు పోసే పాడి రైతుల కష్టాలు రెట్టింపయ్యాయి. పాల బకాయిలు రూ.కోటికి పైగా పేరుకు పోయాయి. పదిహేను రోజులకోసారి బిల్లులు చెల్లించాల్సిన ప్రభుత్వం.. నాలుగు నెలల నుంచి పైసా విదల్చలేదు. కేసీఆర్ హయాంలో ప్రోత్సాహకాలు ఇచ్చి మరీ పాడి రైతులను ప్రోత్సహించారు. కానీ రేవంత్ సర్కారు వచ్చాక వారిని పట్టించుకున్న వారే లేరు. నాలుగు నెలలుగా బిల్లులు చెల్లించక పోవడంతో రూ.కోటికి పైగా బకాయిలు పేరుకుపోయాయి. బిల్లుల కోసం చివరకు రోడ్డెక్కినా స్పందించే వారే కరువయ్యారు. దీంతో పాడి రైతులు ఆగమవుతున్నారు.
– నిజామాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
పాల ఉత్పత్తి సహకార సంఘాలుగా ఏర్పడిన రైతులు విజయ డెయిరీకి పాలు సరఫరా చేస్తున్నారు. బ్యాంకుల్లో, మహిళా సంఘాల్లో, వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు చేసి వారు పశువులు కొనుగోలు చేశారు. అప్పులకు కిస్తీలు క్రమం తప్పకుండా కట్టాల్సి ఉంటుంది. పశువులకు దాణా, మిండ్రాల్ మిక్చర్, కాల్షియం, మందులు, కూలీలకు వేతనాలు తదితరాలకు డబ్బులు అవసరముంటాయి. విజయ డెయిరీ నుంచి చెల్లింపులు సరిగా జరుగకపోవడంతో వారంతా డబ్బుల్లేక ఆందోళన చెందుతున్నారు. చివరకు అప్పు తెచ్చి పెట్టుబడి పెడుతున్నారు. సూక్ష్మ రుణాలనే ఎక్కువ మంది ఆశ్రయిస్తున్నారు. గ్రామాల్లో మైక్రో ఫైనాన్స్ వ్యాపారులు రోజూ ఉదయమే ఇంటికొచ్చి డబ్బులు అడుగుతారు. ప్రభుత్వం నుంచి పైసల్ రాకపోవడంతో వారికి మొఖం చూపించలేక రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. వడ్డీ వ్యాపారులకు చెల్లించాల్సిన కిస్తీలను కట్టేందుకు మరింత అప్పు చేయాల్సి వస్తోంది. సమయానికి డబ్బులు రాక వడ్డీలకు వడ్డీలు కడుతూ పాడి రైతుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. పెండింగ్ బిల్లులపై విజయ డెయిరీ అధికారుల వివరణ కోరేందుకు యత్నించగా స్పందించేందుకు వారు నిరాకరిస్తున్నారు.
ప్రభుత్వ ఆధీనంలో నడిచే విజయ డెయిరీ ఉమ్మడి జిల్లాలోని వేలాది మంది రైతుల నుంచి పాలను సేకరిస్తుంది. ఇలా సేకరించిన పాలతో పాల ఉత్పత్తులను తయారు చేసి విక్రయిస్తుంటుంది. కేసీఆర్ సర్కారు హయాంలో పదిహేను రోజులకోసారి కచ్చితంగా బిల్లులు చెల్లించేవారు. అంతేకాదు, అప్పటి ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తూ పాడి రైతులకు అండగా నిలిచేది. అయితే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పాడి రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రోత్సాహకాలు లేకపోయినా, పోసిన పాలకు సకాలంలో డబ్బులైనా చెల్లించాలని
కోరుతున్నారు.
నిజామాబాద్ జిల్లాలో సుమారు 8 వేల మంది రైతుల పేర్లు విజయ డెయిరీలో నమోదై ఉన్నాయి. ఇందులో 4500 మంది మాత్రమే సెప్టెంబర్ – ఫిబ్రవరి మధ్య సీజన్లో పాలను విక్రయిస్తున్నారు. అన్‌సీజన్‌గా భావించే మార్చి – ఆగస్టు మధ్య కాలంలో 2 వేల మంది మాత్రమే విజయ డెయిరీకి పాలు పోస్తుంటారు. ఇందుకు గాను 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తారు. కానీ నాలుగు నెలల నుంచి డబ్బులు రావట్లేదు. జిల్లాలో 5 వేల మంది పాడి రైతులకు నాలుగు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. అంటే అక్షరాల రూ.కోటి దాకా బకాయిలు పేరుకు పోయాయి. కాంగ్రెస్ గద్దెనెక్కాక పాడి రైతులను పట్టించుకున్న వారే లేరు. విజయ డెయిరీ అధికారుల తీరు కూడా మారిపోయింది. పాలను సేకరించి ప్రాసెసింగ్ యూనిట్‌కు తరలించి, తయారుచేసిన పాల ఉత్పత్తులను జోరుగా విక్రయించేవారు. ఇప్పుడా జోష్ లేకుండా పోయింది. బకాయిలపై డెయిరీ అధికారులను ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వడం లేదు సరికదా రైతులపైనే రుసరుసలాడుతుండడం గమనార్హం.
విజయ డెయిరీకి రోజూ పాలు పోస్తాను. గతంలో చెల్లింపులు సరిగ్గా జరిగేవి. కొద్ది రోజులుగా పేరుకు పోతున్నాయి. నాకు రూ.40 వేలు రావాలి. మాకు న్యాయంగా రావాల్సిన డబ్బులు ఇవ్వకపోతే మేమెట్లా బతకాలి. మూగ జీవాలను ఎట్లా సాదేది. పాడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.
– సుబ్బలక్ష్మి, మహిళా రైతు, కోటగిరి
మునుపు ప్రతి 15 రోజులకోసారి పాల బిల్లులు వచ్చేవి. ఈమధ్య పైసలే వస్తలేవు. రోజులు గడుస్తున్నా బిల్లులు ఇయ్యక పోతే మేం ఎట్లా బతికేది. పశువులకు దాణా కొనడానికి ఇబ్బంది అవుతున్నది. విజయ డెయిరీ నుంచి నాకు రూ.50వేల వరకు డబ్బులు రావాలి. పాడి రైతులను వేధించడం సరికాదు.
– ప్రశాంత్, పాడి రైతు, కోటగిరి