పెద్ద కొడప్గల్, జూన్ 7: విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని, జేఎల్ఎంను వెంటనే నియమించాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. మండలంలోని అల్లాపూర్ గ్రామ రైతులు పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలోని సబ్‌స్టేషన్ కార్యాలయం ఎదుట శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. అల్లాపూర్ గ్రామంలో జేఎల్ఎం లేడని, నెలరోజులుగా విద్యుత్ సమస్యలు తలెత్తుతున్నా ఏ అధికారిని అడిగినా స్పందించడంలేదన్నారు. బోరుబావుల వద్ద విద్యుత్ తీగల సమస్య ఏర్పడితే ఎల్సీ ఇవ్వాలని అడిగితే ఇవ్వడంలేదని, లైన్‌మన్‌కు చెప్పండి అంటూ సమాధానం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
కొన్నిచోట్ల 11 కేవీ విద్యుత్ తీగలు చేతికందే ఎత్తులో ఉన్నాయని, కొన్ని స్తంభాలు వంగిపోయి ప్రమాదకరంగా మారాయని తెలిపారు. వారంలో రెండురోజులు విద్యుత్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, రాత్రివేళలో నరకం అనుభవిస్తున్నామని వాపోయారు. విద్యుత్ అధికారులు స్పందించి వెంటనే శాశ్వత జేఎల్ఎంను నియమించి, గ్రామంలో విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఇన్చార్జి ఏఈ పవన్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రైతులు అంబరెడ్డి, మార్గం పండరి, బుగ్గ రాములు, జక్కపూర్ అంబయ్య, అశోక్ రావు తదితరులు పాల్గొన్నారు.