భీమ్గల్, ఆగస్టు 23: ‘రుణమాఫీ జరగని రైతులు వ్యవసాయ కార్యాలయాల్లో దరఖాస్తులు ఇవ్వండి..అధికారులు మీ సమస్యను పరిష్కరిస్తారు’ అంటూ సాక్షాత్తు సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం అలాంటిదేమీ కనిపించడం లేదు. అందుకు నిదర్శనమే భీమ్గల్లోని సహాయక వ్యవసాయ సంచాలక, మండల వ్యవసాయాధికారి కార్యాలయాలు.
ఈ ఆఫీసుల పరిధిలో ఐదు వ్యవసాయ క్లస్టర్లు ఉండగా, ఏవోతోపాటు ఐదుగురు వ్యవసాయ విస్తీర్ణ అధికారులు విధులు నిర్వర్తిస్తుంటారు. వివిధ కారణాలతో రుణమాఫీ జరగని రైతులు శుక్రవారం అధికారులను కలిసి తమ గోడు వెళ్లబోసుకుందామని రాగా.. కార్యాలయానికి తాళం దర్శనమిచ్చింది. ఉదయం 11దాటినా ఏ ఒక్క అధికారి రాకపోవడంతో అసంతృప్తి వ్యక్తంచేశారు. అధికారులు వచ్చేవరకు పడిగాపులు కాశారు. మరోవైపు అర్హులమైన తమకు రుణమాఫీ చేయకుండా సీఎం రేవంత్రెడ్డి మోసం చేశారని రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఎన్నికల్లో గెలిచినంక అందరికీ రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్రెడ్డి చెప్పిండు. నమ్మి.. ఓట్లు వేసినం. అధికారంలోకి రాగానే ఏదో కొందరికి చేసి చేతులు దులుపుకొన్నాడు ఈ సీఎం రేవంత్ రెడ్డి. ఇచ్చిన మాటప్రకారం అందరికీ రుణమాఫీ చేయాలే.. లేకుంటే రైతులమందరం రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేసుడే.
– చిన్నోల్ల గంగాప్రసాద్, రైతు, జాగిర్యాల్
తీసుకున్న రుణం మాఫీ కాలేదు. బ్యాంకుకు వెళ్లి అడిగితే మాకేం తెల్వదు అంటున్నరు. రుణం మాఫీ చేస్తామంటే ఓట్లు వేసి గెలిపించినం. కానీ, ఇప్పుడు మమ్మల్ని మస్తు బాధపెడుతున్నదీ కాంగ్రెస్ సర్కారు. పొద్దున అచ్చికూసున్న పదకొండు అయినా ఓళ్లూ రాలేదు.
-గుగ్లోత్ జెన్ను, మహిళా రైతు, కారేపల్లి
తీసుకున్న రుణం మాఫీ కాక ఎదురుచూస్తు న్నం. గెలిచిన వెంటనే రుణమాఫీ చేస్తామని చెప్పిన సీఎం రేవంత్రెడ్డి మాట తప్పిండు. ఎట్లగైనా రైతులకు ఇచ్చినమాట ప్రకారం మాఫీ చె య్యాలే. లేకుంటే రాబోవు రోజుల్లో తగిన గుణపాఠం చెప్తం.
నమ్మి ఓట్లు వేసిన మాకు ఇప్పుడు సుక్క లు సూపెడుతున్నడు.బ్యాంకులో తీసుకు న్న రు ణం మాఫీ అయితదని సంబురపడ్డం.కానీ, ఇప్పుడు మాఫీకాక పొద్దున లేచిన నుంచి ఆఫీసుల సుట్టూ తిరుగుతున్నం. రుణమాఫీ అయితదని ఏ ఒక్క సారూ చెప్తలేరు. మా బాధలు ఎవరికి చెప్పాలా అని ఆఫీసుకు వస్తే ఇక్కడేమో సార్లు లేరు.
– దేవాగత్ సీతారాం, రైతు, ఎంజీ తండా
రుణమాఫీ వస్తదని మస్తు సంబురపడ్డాం. తీరా ఇప్పుడు మాఫీ కాకపోవడంతో ఏం చేయాలో అర్థం అయితలేదు. మా ఊర్లో చానామంది రైతులకు మాఫీ కాలేదు. ఆఫీసుల పొంట తిరుగుతున్న. ఏ ఒక్కరు కూడా సక్కంగ చెప్తలేరు. సీఎం సారూ నీకు దండంపెడుతా జర రుణమాఫీ చెయ్యు.
– గుగ్లోత్ రాములు, రైతు, కారేపల్లి