ఆర్మూర్‌టౌన్/ఖలీల్‌వాడి, మే 2: ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ, దొడ్డు రకం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. ఆర్మూర్ పట్టణం పెర్కిట్ శివారులోని 44వ జాతీయ రహదారికి సమీపంలో ఉన్న కొనుగోలు కేంద్రం వద్ద శనివారం ధర్నా చేపట్టారు. కొనుగోలు కేంద్రం ప్రారంభించి 15 రోజులు అవుతున్నా ధాన్యాన్ని కాంటా చేయడంలో తీవ్ర జాప్యం నెలకొంటున్నదని మండిపడ్డారు. సొసైటీ అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. కేంద్రంలో కాంటా చేసినా ధాన్యాన్ని రైస్‌మిల్లులకు తరలించడంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
కాంటా చేసి తరలించిన ధాన్యాన్ని రైస్‌మిల్లులకు తరలించినా యజమానులు అన్లోడ్ చేసుకోవడంలేదని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రైతుల ధర్నా సమాచారం అందుకున్న ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ గౌడ్ అక్కడికి చేరుకొని వారిని సముదాయించారు. సంబంధిత అధికారులతో చర్చించి సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించారు. దీంతో రైతులు ధర్నా విరమించారు. కా ర్యక్రమంలో రైతులు నచ్చు చిన్నారెడ్డి, పాలేపు రాజురెడ్డి, గంగారెడ్డి, రవి రెడ్డి, నచ్చు గంగారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దొడ్డు రకం ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ మోపాల్ మండల కేంద్రంలో ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో రైతులు శనివారం రాస్తారోకో నిర్వహించారు. మానవహారం నిర్మించి ప్రభుత్వతీరుపై నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేల్పూర్ భూమయ్య, మోపాల్ గ్రామ సర్పంచ్ రవి, అగ్గు చిన్నయ్య మాట్లాడుతూ..ధాన్యాన్ని కేంద్రానికి తరలించి 15 నుంచి 20 రోజులు అవుతున్నా పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. దొడ్డు రకం ధాన్యాన్ని రైస్‌మిల్లర్లు తీసుకోవడంలేదని వాపోయారు. ధాన్యం సేకరణలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వి మర్శించారు. ధాన్యం కొనుగోళ్లపై ఇలాగే జా ప్యం చేస్తే చలో కలెక్టరేట్ చేపడుతామని హెచ్చరించారు. నాయకులు గంగాధర్, నరేశ్, పోత న్న, నారాయణ, గంగాధర్, నడ్పన్న, మల్లవ్వ, నర్సవ్వ, గంగసాయిలు, నవీన్ పాల్గొన్నారు.