రామారెడ్డి, ఆగస్టు 30: రైతులు యూరియా కోసం నానా కష్టాలు పడుతున్నారు. ప్రభుత్వం సరిపడా యూరియా అందుబాటులో ఉంచకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూరియా కోసం సొసైటీ గోదాముల వద్ద ఉదయం నుంచే బారులు తీరుతున్నారు. యూరియా కోసం రామారెడ్డి మండల కేంద్రంలో రైతులు శనివారం ధర్నా చేపట్టారు. సొసైటీకి శనివారం 440 బస్తాల యూరియా రాగా.. దాదాపు తొమ్మిది వందల మంది క్యూలో నిల్చున్నారు.
రెండెకరాలకు ఒక బస్తా చొప్పున యూరియా పంపిణీ చేయగా.. సరిపోదని పెంచి ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడడంతో యూరియా పంపిణీని నిలిపివేయగా.. రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తంచేశారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు అక్కడికి చేరుకొని రైతులతో కలిసి ధర్నా చేపట్టారు. పోలీసులు అక్కడికి చేరుకొని యూరియా పంపిణీ చేయిస్తామని చెప్పడంతో రైతులు శాంతించారు. అనంతరం పోలీసు పహారా మధ్య యూరియా పంపిణీ చేశారు.
యూరియా పంపిణీ కోసం క్యూలో నిల్చున్న మహిళా రైతులు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో యూరియా కొరత లేకుండేనని, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను క్యూలో నిల బెట్టడం సిగ్గుచేటని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులకు వారి సొంతపనుల మీద ఉన్న శ్రద్ధ రైతుల మీదలేదని విమర్శించారు. యూరియా కొరతపై మండల వ్యవసాయాధికారిని సంప్రదించగా శనివారం ఒకలారీ లోడ్ మాత్రమే వచ్చిందని తెలిపారు. ఇండెంట్ పెట్టామని, త్వరలో యూరియా వస్తుందని తెలిపారు.