రైతుల సమస్యలపై పాలకులకు పట్టింపులేకుండా పోతున్నది. యాసంగి పై యంత్రాంగం ముందస్తు ప్రణాళికలు రూపొందించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నది. ప్రస్తుతం యాసంగి పంట కాలం ముగిసిపోనుండగా.. బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాల్లో పంట కోతలు షురూ అయ్యాయి. ధాన్యం రాక మొదలైనప్పటికీ ప్రభుత్వంలో అప్రమత్తత కరువైంది. కామారెడ్డి జిల్లాలో పౌరసరఫరాల శాఖతో కలెక్టర్ సమీక్షలు నిర్వహించి, వ్యూహాలు రచించారు.
కొనుగోలు కేంద్రాలు ఎప్పటిలోగా ప్రారంభించేది మాత్రం వెల్లడించలేదు. నిజామాబాద్ జిల్లాలో అయితే ప్రాథమిక సమాచారం కూడా కరువైంది. సమీక్షలు సైతం పత్తా లేకుండా పోయాయి. ఉమ్మడి జిల్లాలో రైతుల స్థితి గతులపై ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష చేస్తేనే ఏమైనా ఫలితం ఉంటుందని కర్షకులు ఆశ పడుతున్నారు. ఏడాది కాలంగా ధాన్యం కొనుగోళ్లపై సర్కారులో కనీసం శ్రద్ధ కానరావడం లేదు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం సమన్వయంతో నడుచుకుని యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం లేదు. ఈ దుస్థితిలో ఇన్చార్జి మంత్రి రంగంలోకి దిగి యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని రైతులు కోరుతున్నారు.
-నిజామాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
రాష్ట్రంలో తొలుత వరి పంట కోతకు వచ్చే ప్రాంతాల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడ, బోధన్, జుక్కల్ నియోజకవర్గాలు ముందుంటాయి. యాసంగి, వానకాలం లో మొదట ఇక్కడే వరి కోతలు మొదలవుతుండడం ఆనవాయితీగా వస్తున్నది. కోతలు పూర్తికాగానే వెంటనే దుక్కి దున్నడం, ఆ వెంటనే వరి నాట్లకు సంసిద్ధులు కావడం ఈ ప్రాంత రైతన్నల ప్రత్యేకత.
కోతలు ప్రారంభమైన ఈ పరిస్థితిలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై కాంగ్రెస్ సర్కారు నుంచి ఉలుకూ పలుకూ కరువైంది. నిజామాబాద్ జిల్లాలో యాసంగిలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 1.13లక్షల హెక్టార్లు కాగా అంతకు ఎక్కువే పంటను సాగు చేశారు. దాదాపుగా 12లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉన్నదని వ్యవసాయ శాఖ అంచనాలున్నాయి.
ఇందులో అధిక భాగం గంగా కావేరి ఉంది. మిగిలినది దొడ్డు రకం దిగుబడులు వచ్చే అవకాశాలున్నాయి. 6లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించేందుకు నిజామాబాద్ జిల్లా యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం గతేడాది మాదిరిగానే సుమారుగా 460 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అయితే బోధన్, బాన్సువాడ నియోజకవర్గాల పరిధిలో కోతలు షురూ అయినప్పటికీ నిజామాబాద్ జిల్లాలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఊసే లేకపోవడం రైతులను ఆందోళనకు గురి చేస్తున్నది. పంట కోస్తున్న రైతులంతా అందుబాటులో ధాన్యం సేకరణ కేంద్రాలు లేకపోవడంతో ప్రైవేటు వ్యక్తులకు విక్రయించేందుకు సిద్ధమవుతున్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యంపై అసహనం వ్యక్తంచేస్తున్నారు.
కామారెడ్డి జిల్లాలో ఈ నెల13న కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించిన సన్నాహక సమావేశంలో 424 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు నిర్ణ యం తీసుకున్నారు. యాసంగిలో 2,61, 110 ఎకరాల్లో వరి సాగు చేయగా 57,445 ఎకరాల్లో సన్నరకం, 2లక్షల 3వేల 665 ఎకరాల్లో దొడ్డురకం సాగు చేశారు. 1,32,121 మెట్రిక్ టన్నుల సన్న రకం, 4,88,796 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం ధాన్యం దిగుబడులు వస్తాయని అంచనాలు రూపొందించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే క్వింటా ధాన్యానికి రూ.500 బోనస్ అందిస్తామని హామీ ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 15నెలలు గడుస్తున్నా బోనస్‌పై అతీగతీ లేదు. గత వానకాలంలో బోనస్‌ను కేవలం సన్న రకాలకే అమలు చేశారు. సన్నరకాలు పండించిన రైతులకు సైతం అరకొరగానే బోనస్ ఇచ్చారు. ఈసారి బోనస్ రూపంలో వచ్చే ప్రోత్సాహకాలను అందిపుచ్చుకునేందుకు రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం చెప్పిన సన్న రకం వడ్లనే రైతులు సాగు చేశారు. సన్న రకం ధాన్యం సాగులో రిస్క్‌ను గ్రహించి చాలా మంది రైతులు దొడ్డు రకాలపైనే దృష్టిసారించారు. నీటి వనరుల లభ్యత, పెట్టుబడి వ్యయాలకు భయపడి వెనుకడుగు వేశారు. దొడ్డు రకం ధాన్యానికి సైతం బోనస్ అమలు చేసి రైతులకు ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని రైతులంతా కోరుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిం ది. వారి సమస్యలను ఆలకించే నాథుడు కూడా లేకుండా పోయాడు. ఓ వైపు భూగర్భ జలాలు పడిపోవడం, సాగునీటికి కటకట ఏర్పడింది. దీంతో చేతికి వచ్చిన పంటను అమ్ముకునేందుకు ప్రభు త్వం నుంచి కేంద్రాల ఏర్పాటులో స్పష్టత లేకపోవడంతో రైతులు ఆగమాగమవుతున్నారు. ప్రైవేటు వ్యాపారులకు ధాన్యాన్ని అమ్ముకుంటే నష్టాలు సంభవిస్తాయని బాధపడుతున్నారు. గత సీజన్లోనూ కేంద్రాల ఏర్పాటులో తాత్సారం చేయడంతో చాలా మంది ప్రైవేటు వర్తకులను ఆశ్రయించారు. ఈసారి అలా కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని రైతులు కోరుతున్నారు. కేసీఆర్ హయాం లో అమలైన పద్ధతిలోనే ధాన్యం రాకను దృష్టిలో పెట్టుకుని సేకరణ చేపట్టాలని సూచిస్తున్నారు.