ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడంలో కూడా రైతన్నకు కష్టాలు తప్పడం లేదు. మొన్నటి వరకు వాన రూపంలో ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులకు.. ఇప్పుడు తరుగు, ధాన్యం బస్తాల తరలింపులో కష్టాలు వెంటాడుతున్నాయి. ధాన్యం బస్తాలు రైస్‌మిల్లుకు తరలించాలంటే.. రూ.800 ఇవ్వాల్సిందే అని లారీ డ్రైవర్ తేల్చిచెప్పాడు. రైతులు అందుకు ఒప్పుకోకపోవడంతో లారీ వెనక్కి వెళ్లిన ఘటన మగ్దుంపూర్‌లో చోటుచేసుకున్నది. తరుగు పేరుతో మోసం చేస్తున్నారని పొతంగల్ మండలం కొడిచర్లలో రైతులు కేంద్రం నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు లారీలు రాకపోవడంతో గోపాల్పేట కొనుగోలు కేంద్రంలో కాంటా వేసిన 2800బస్తాలు అలాగే ఉన్నాయి. దీంతో అక్కడ తూకం వేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
నిజాంసాగర్, నవంబర్ 9: కాంటా చేసిన ధాన్యం బస్తాలను తరలించాలంటే మామూళ్లు ఇవ్వల్సిందేనని లారీ డ్రైవర్ చెప్పడంతో బస్తాలు అక్కడే నిలిచిపోయాయి. ఈ ఘటన కామారెడ్డి జిల్లా మహ్మద్‌నగర్ మండలంలోని మగ్దుంపూర్‌లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేం ద్రంలో ఆదివారం ఉదయం చోటుచేసుకున్నది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన కేంద్రం నిర్వాహకులు రైస్‌మిల్లులకు తరలించేందుకు బస్తాలు సిద్ధంగా ఉంచారు. ఆదివారం ఉద యం ధాన్యం బస్తాలను తీసుకెళ్లేందుకు లారీ వచ్చింది. లారీ డ్రైవర్ మాత్రం తనకు బస్తాకు ఒక్క రూపాయి చొప్పున మొత్తం రూ.800 ఇస్తేనే తీసుకెళ్తానని చెప్పాడు. ధాన్యం తూకం వేయించిన రైతులు అందుకు ఒప్పుకోలేదు. దీంతో లారీ వెనక్కి వెళ్లింది. తూకం వేసిన బస్తా లు కొనుగోలు కేంద్రంలోనే ఉన్నాయి.
నాగిరెడ్డిపేట, నవంబర్9: లారీల కొరతతో తూకం వేసిన ధాన్యం బస్తాలు రైస్ మిల్లులకు తరలిండం లేదు. దీంతో కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండల కేంద్రం గోపాల్‌పేటలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఆదివారం నిరసన వ్యక్తంచేశారు. కొనుగోలు కేంద్రంలో సుమారు 2800 వరకు కాంటా చేసిన ధాన్యం బస్తాలు ఉన్నాయి. వాటిని తరలించకపోవడంతో కాంటా వేయడం లేయడం లేదని మిగితా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కొనుగోలు కేంద్రం వద్ద ఆదివారం ఉదయం నిరసన తెలిపారు. వెంటనే లారీలు వచ్చేలా చూడాలని రైతులు కోరారు. ఈ విషయమై మండల సమాఖ్య అధ్యక్షురాలు శాంతాబాయి మాట్లాడుతూ.. లారీల కొరతతో ధాన్యం బస్తాలు తరలించడం లేదన్నారు. కలెక్టర్ స్పందించి లారీలను పంపించి, సమస్యను పరిష్కరించాలని కోరారు.
పొతంగల్, నవంబర్ 9: కొనుగోలు కేంద్రాల్లోనే నిర్వాహకులు తరుగు పేరుతో దోచుకుంటున్నారని నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండలంలోని కొడిచర్లలో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రం నిర్వాహకులపై ఆదివారం ఆగ్రహం వ్యక్తంచేశారు. కొనుగోలు కేంద్రం నిర్వాహకులతో సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడారు. ఒక్కో బస్తా 41.500 కిలోల చొప్పున కాంటా వేసిన ధాన్యం లారీలో లోడ్ చేసుకొని మిల్లుకు వెళ్లేసరికి లారీకి 8 నుంచి 10 బస్తాలు ఎలా తక్కువ వస్తాయంటూ నిర్వాహకులను ప్రశ్నించారు. బస్తాలు తక్కువ చ్చిన విషయం రైతులకు చెప్పకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గ్రామానికి చెందిన ఒక రైతు 85 బస్తాల ధాన్యాన్ని విక్రయించగా.. నిర్వాహకులు అతడికి 80 బస్తాలు మాత్రమే ట్రక్ షీట్ రాయడంపై అతడు అధికారులను నిలదీశాడు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు.