నాగిరెడ్డిపేట, నవంబర్ 21: వరుణుడు కనికరం చూపకపోవడంతో వానాకాలం సీజన్లో రైతులు సాగుచేసిన పంట సగం వర్షార్పణం అయ్యింది. మిగిలిన పంటను అష్టకష్టాలకు ఓర్చి రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించారు. ఇందుకు ఖర్చులు తడిసి మోపెడు అయ్యాయి. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించినా.. ఇక్కడ కూడా తమకు కష్టాలు తప్పడం లేదని మండలంలోని చీనూర్ గ్రామ రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చిన అనంతరం వర్షం కురియడంతో నానా కష్టాలు పడి కాపాడుకున్నామని, తీరా సీరియల్ వచ్చి కాంటా పెడితే సంతోషపడ్డామని రైతులు తెలిపారు. కానీ ధాన్యం కాంటా చేసి ఐదు రోజులు గడుస్తున్నా.. ఇప్పటికీ తరలించడం లేదని వారు ఆవేదన వ్యక్తంచేశారు. శుక్రవారం ఒక లారీ వచ్చి ధాన్యం తీసుకెళ్లినట్లు తెలిపారు.
ధాన్యం ఎప్పుడు తరలిస్తారని సెంటర్ ఇన్చార్జి రవిని అడిగితే.. లారీలు రావడం లేదని, తానేమీ చేయలేనని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నాడని, దిక్కున్న చోటు చెప్పుకోండని దురుసుగా మాట్లాడుతున్నాడని రైతులు వాపోయారు. కాంటా చేసిన ధాన్యం రోజుల తరబడి ఇక్కడే ఉంటే.. రైస్ మిల్లర్లు తరుగు తీస్తారని ఆందోళన చెందుతున్నారు. పక్క గ్రామాల్లో ఉన్న కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని లారీల్లో తరలిస్తున్నారని, తమ గ్రామంపై ఎందుకు చిన్నచూపు అని చీనూర్ గ్రామ రైతులు ప్రశ్నిస్తున్నారు. కాంటా చేసిన ధాన్యం తరలించే వరకూ మిగితా ధాన్యం తూకం వేయకుండా నిలిపివేశారని అన్నారు. కాంటా చేసిన ధాన్యం వెంటనే తరలించాలని, లేనిపక్షంలో జాతీయ రహదారిపై ధర్నా చేస్తామని రైతులు హెచ్చరించారు.
మేము పడుతున్న కష్టాలను ఆ పరమాత్ముడే చూడాలి. ఈయేడు మొత్తం కష్టాల్లోకి తీసుకుపోయిండు. మిగిలిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తేస్తే..కాంటా కదలడం లేదు. ఐదు రోజులుగా లారీలు లేవంటూ చెబుతున్నారు. ఐదు రోజులుగా కాంటా పూర్తిగా నిలిచిపోయింది. ఇకనైనా అధికారులు స్పందించి ధాన్యం త్వరగా తరలించేలా ఏర్పాట్లు చేయాలి.
-కుర్మ రాములు, రైతు, చీనూర్