బాన్సువాడ రూరల్, ఏప్రిల్ 26: గన్నీ బ్యాగుల పంపిణీలో అధికారులు, సిబ్బంది తీరును నిరసిస్తూ కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలోని సహకార సంఘాన్ని 500 మంది రైతులు ఆదివారం ముట్టడించారు. ధాన్యం ఆరబెట్టి రోజులు గడుస్తున్నా, గన్నీ బ్యాగుల కొరత పేరుతో ధాన్యాన్ని కాంట చేయడం లేదని సిబ్బంది తీరుపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సొసైటీ కార్యదర్శి సెలవులపై వెళ్లడంతో కిందిస్థాయి సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కొంతమంది సిబ్బంది బడా రైతులతో కుమ్మక్కై వారికే గన్నీ బ్యాగులు ఇస్తున్నారని,
చిన్న, సన్నకారు రైతులకు బస్తాల కొరత పేరుతో ఇవ్వడం లేదని ఆరోపించారు. గన్నీ బ్యాగులు లేక ధాన్యం కల్లాల్లోనే ఉన్నదని వాపోయారు. వడ్లు పూర్తిగా ఎండిపోవడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదని అన్నారు. రైతులకు కావాల్సిన గన్నీ బ్యాగులు సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా, క్షేత్రస్థాయిలో కొరత ఉన్నదని తెలిపారు. గన్నీ బ్యాగులు ఇవ్వాలని సొసైటీ సిబ్బంది చుట్టూ తిరిగినా వారు పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. సరఫరా లేనిది తాము ఏం చేస్తామంటూ కటువుగా సమాధానం చెబుతున్నారని ఆరోపించారు. జిల్లా కలెక్టర్, సంబంధిత ఉన్నతాధికారులు చొరవ తీసుకొని గన్నీ బ్యాగులు సరఫరా చేయాలని కోరారు.