Supreme Court : రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భారీ సంఖ్యలో భారతీయులు కూడా పాల్గొన్నారు. వీరిలో కొందరు ప్రాణాలు కోల్పోగా.. ఇంకొందరు గాయపడ్డారు. మరికొందరి గురించి అసలు సమాచారమే లేదు. దీంతో వారి కుటుంబాలకు న్యాయం చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని భారత సుప్రీంకోర్టు ఆదేశించింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో బలైన భారతీయ కుటుంబాలకు సహాయం అందించేందుకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో ఒక నోడల్ అధికారిని నియమించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. అలాగే, ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన, గాయపడ్డ, మిస్సైన వారి వివరాలను బాధిత కుటుంబాలకు స్థానిక భాషలో అందజేయాల్సిందిగా కూడా ప్రభుత్వానికి కోర్టు సూచించింది.
నిజానికి రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొన్న భారతీయులకు సంబంధించిన వివరాలపై అధికారిక ప్రకటన ఏదీ లేదు. ఇదే సమయంలో ప్రభుత్వం కూడా ఎలాంటి వివరాల్ని వెల్లడించలేదు. దీంతో ఇంతకాలంగా ఈ విషయంలో తమ వారిని దూరం చేసుకున్న భారతీయ కుటుంబాలు తమకు న్యాయం చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీనిపై సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి, జస్టిస్ వీ మోహన్ ఆధ్వర్యంలోని బెంచ్ విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. బాధిత కుటుంబాల డీఎన్ఏ సేకరించి, మృతుల డీఎన్ఏతో పోల్చి, వారి మృతదేహాల్ని లేదా అస్థికల్ని కుటుంబ సభ్యులకు అందజేయాలని కోరింది. ఇండియాలోని రష్యా రాయబార కార్యాలయం నుంచి బాధితులకు సంబంధించి తగిన వివరాలు సేకరించాలని, నష్టపరిహారం కూడా అందజేయాలని కోర్టు సూచించింది. ఈ విషయంలో బాధిత కుటుంబాలకు నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (ఎన్ఏఎల్ఎస్ఏ), స్టేట్ లీగల్ సర్వీసెస్‌లు సహాయం అందించాలని సూచించింది.
మృతదేహాలను లేదా అస్థికలను బాధిత కుటుంబాలకు అందజేయడంలో, పరిహారం అందజేయడంలో సహాయం చేయాలని ఆదేశించింది. దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభించాలని, బాధిత కుటుంబాలకు పరిహారం, న్యాయం అందేలా రష్యా రాయబార కార్యాలయాల్ని ఆదేశించేలా దావా దాఖలు చేయాలని కూడా కేంద్రాన్ని కోరింది. ఈ పరిహారం విదేశీ వ్యవహారాల శాఖ ద్వారా మాత్రమే అందజేయాలని సూచించింది. ఈ పరిహారం అందడం ఆలస్యమైనంత మాత్రాన మృతదేహాల్ని అప్పగించడంలో ఆలస్యం చేసి, అంత్యక్రియలు నిర్వహించడంలో ఆలస్యం జరిగేలా చేయొద్దని కూడా సూచించింది. 2024, 2025లో చాలా మంది భారతీయులు వివిధ వర్క్ వీసాలపై రష్యా వెళ్లారు. అయితే, అక్కడ చాలామందిని రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో వాడుకున్నట్లు ఆరోపణలున్నాయి.