చెన్నై: దేశవాళీ ఫస్ట్‌క్లాస్ టోర్నీ దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ భారీ విజయం దిశగా సాగుతున్నది. చెన్నైలో జరుగుతున్న టైటిల్ పోరులో సౌత్ జోన్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 336 పరుగులకే ఆలౌట్ చేసిన ఆ జట్టు.. 372 పరుగుల ఫస్ట్ ఇన్నింగ్స్ లీడ్‌తో ట్రోఫీని ఖాయం చేసుకుంది. ఓవర్‌నైట్ స్కోరు 242/5తో నాలుగో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన సౌత్‌ను కెప్టెన్ తిలక్ వర్మ (211 బంతుల్లో 9 ఫోర్లతో 99), సీవీ మిలింద్ (68 బంతుల్లో 7 ఫోర్లతో 43) గట్టెక్కించే యత్నం చేశారు. కానీ మిలింద్ నిష్క్రమణ తర్వాత తిలక్ పోరాడినా లోయరార్డర్ విఫలమైంది.
సెంచరీకి ఒక్క పరుగు దూరంలో తిలక్ ఔట్ అవడంతో ఆ జట్టు ఇన్నింగ్స్‌కు తెరపడింది. అయితే ఈస్ట్ సారథి ఇషాన్ మాత్రం ప్రత్యర్థిని ఫాలోఆన్ ఆడించలేదు. రెండో ఇన్నింగ్స్‌కు వచ్చిన ఆ జట్టు.. బుధవారం చివరకు 5 వికెట్ల నష్టానికి 212 రన్స్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీతో చెలరేగిన ఇషాన్.. రెండో ఇన్నింగ్స్ (98 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 80)లోనూ రాణించాడు. ప్రస్తుతం ఆ జట్టు 584 పరుగుల భారీ ఆధిక్యంలో ఉంది. కాగా, దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు(350) చేసిన ఇషాన్.. రమణ్‌దీప్ లంబా(320) రికార్డును బ్రేక్ చేశాడు.