పొతంగల్/ నాగిరెడ్డిపేట/ధర్పల్లి/ రెంజల్/బాన్సువాడ/ ఆగస్టు 31 : ఇటీవల కురిసిన భారీ వర్షాలు ఉమ్మడి జిల్లాలను అతలాకుతలం చేశాయి. కుంభవృష్టి వానలు రైతులకు గుండెకోతను మిగిల్చాయి. వాగులు, వంకలు, చెరువులు, కాలువలు ఉప్పొంగడంతో వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. పలుచోట్ల ఇసుక మేటలు వేశాయి. నెల రోజుల్లో చేతికందే దశలో పంటలు వర్షం పాలు కావడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.
కొన్ని రోజుల్లో పంట చేతికందుతుందని అనుకుంటే వర్షాలతో వచ్చిన వరదలతో మొత్తం ఊడ్చేసిందని ఆందోళన చెం దుతున్నారు. భారీ వర్షాలకు పొతంగల్ మండలంలో మంజీరా పరీవాహక ప్రాంతాలైన కల్లూర్, కొడిచర్ల, హంగర్గ, కారేగాం, హెగ్డొలి, కొల్లూర్, సోంపూర్, సుంకినీ, టాక్లి గ్రామాల్లో సుమారు 854 మంది రైతులకు చెందిన రెండు వేలకు పైగా ఎకరాల సోయా, వరి, మక్క జొన్న, మిర్చి, టమాటా, అరటి వంటి ఉద్యానవన పంటలు నష్టపోయాయి.
నాగిరెడ్డిపేట మండలంలో ఈ సారి వర్షాకాలంలో 17,400 ఎకరాల్లో రైతులు పంటలను సాగు చేసుకున్నారు. పోచారం ప్రాజెక్టు వరదతోపాటు, మంజీర వరదతో 13 గ్రామాలు మాల్తుమ్మెద, గోలిలింగాల, చీనూర్, మేజర్‌వాడి, నాగిరెడ్డిపేట, లింగంపల్లి కలాన్, వెంకంపల్లి, తాండూర్, మాటూర్, మాసన్పల్లి, ఆత్మకూర్, జలాల్పూర్, ఎర్రారం గ్రామాల్లో పంటలు నీట మునిగాయి. మాల్తుమ్మెద శివారులోని ఊర చెరువుకు భారీ వరదలతో గండిపడి మూడు చోట్ల కొట్టుకుపోయింది. దీంతో పోచారం కాలువ కొట్టుకుపోయి దిగువన ఉన్న పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
తాండూర్ శివారులోని నాగనయ్య చెరువుకు గండి పడి భారీగా వరదనీరు దిగువన ఉన్న రెడ్డి కుంటపై పడడంతో..కట్ట కోతకు గురై దిగువన ఉన్న వందల ఎకరాల పంటలు నీట మునిగి పనికి రాకుండా మారాయి. పోచారం ప్రాజెక్టు దిగువన ఉన్న వందల ఎకరాల్లో పంటలు పూర్తిగా కొట్టుకుపోయాయి. మంజీరా పరీవాహక ప్రాంతంలో ఉన్న 13 గ్రామాల శివారులోని విద్యుత్ స్తంభాలు కొట్టుకుపోయాయి.
రెంజల్ మండలంలోని కందకుర్తి, బో ర్గాం, తాడ్‌బిలోలి, నీలా గ్రామాల్లో వరద ఉధృతికి పంటలు ధ్వంసమయ్యాయి. ఎక్కువగా సోయా, వరి, చెరుకు పంటలు వరదలో మునిగి తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ధర్పల్లి మండలంలోని హోన్నాజీపేట్, నడిమి తండా అటవీ ప్రాంతంలోని ముత్యాల చెరువు కట్ట తెగిపోయి ఒకేసారి వరద నడిమి తండా, బీరప్ప తండా, వాడి గ్రామాలను ముంచెత్తింది. వరద తీవ్రతకు పంటలు సైతం నీట మునిగాయి. మండలంలో 621 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు మండల వ్యవసాయాధికారి వెంకటేశ్ తెలిపారు. సోమవారం నుంచి పంట నష్టపోయిన గ్రామాల్లో పర్యటించి రైతుల వారీగా పంట నష్టం నివేదికలు తయారుచేస్తామని పేర్కొన్నారు.
నిజాంసాగర్ మండలంలోని గోర్గల్, అచ్చంపేట్, బొగ్గుగుడిసె, మహ్మద్ నగర్ మండలంలోని తుంకిపల్లి తదితర గ్రామాల్లో పంటపొలాల్లో కంకర, రాళ్లు రప్పలు చేరాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాన్సువాడ డివిజన్లో వందల ఎకరాల్లో పంటలు నష్టపోయినా అధికారులు, ప్రభుత్వం ప్రాథమిక అంచనాలకే పరిమితమైంది. ఇప్పటికీ నష్ట పోయిన పంటలకు పరిహారంపై స్పందించకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
పొలాల్లో మట్టి దిబ్బలు, రాళ్లు చేరాయి
భారీ వర్షాలకు పంట పొలాల్లో మట్టి దిబ్బలు రాళ్లు చేరాయి. ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం అందించాలి. ఎకరానికి రూ.25 వేల చొప్పున పరిహారం ఇవ్వాలి. గతంలో పంటలు పండిం చిన రైతులకు బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పటికీ ఇవ్వలేదు.
-శ్రీ కాంత్ రెడ్డి, రైతు, గోర్గల్
మొత్తం పంట నీటి మునిగింది
మేజర్‌వాడి శివారులో మాకు నాలుగున్నర ఎకరాల భూమి ఉన్నది. వేసుకున్న పంట మొత్తం వారం రోజులుగా నిజాంసాగర్ బ్యాక్ వాటర్‌తో నీట మునిగిపోయింది. పంట మొదటి కలుపు తీశాము. ఇప్పుడు ఎందుకు పనికి రాకుండా పోయింది. చుట్టు పక్కల ప్రాంతమంతా ఇదే దుస్థితి ఉన్నది. ప్రభుత్వం, అధికారులు స్పందించి నష్టపోయిన రైతులకు పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలి.
– గుర్రాల లక్ష్మణ్. మేజర్‌వాడి, రైతు
ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి
ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి. ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు పెట్టుబడి పెట్టాం. వర్షాలకు కొద్ది రోజుల్లో చేతికి వచ్చే పంటను నష్టపోయాం. పొతంగల్ మంజీర శివారులో నాకు ఉన్న 15 ఎకరాల్లో వరి సాగు చేశాను. 5 ఎకరాల పంట నీట మునిగిపోయింది. ప్రభుత్వం ఎకరాకు కనీసం రూ.30 వేలు సహాయం చేయాలని కోరుతున్నాం.
– పి. పరశురాం, రైతు, పొతంగల్