భీమ్గల్, మే 28: నిజామాబాద్ జిల్లాలో విత్తనాల కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. పదేండ్ల కిందటి దృశ్యాలు మళ్లీ కనిపిస్తున్నాయి. విత్తనాల కోసం పదేండ్ల కిందట పట్టా పాస్ పుస్తకాలు, చెప్పులు క్యూలో పెట్టిన విధంగానే ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. భీమ్గల్ పట్టణంలోని నందిగల్లీ పీఏసీఎస్ గోదాము వద్ద జీలుగ విత్తనాల కోసం మంగళవారం రైతులు పట్టా పాస్ పుస్తకాల జిరాక్స్ కాపీలను లైన్లో పెట్టి ఉదయం నుంచి పడిగాపులు కాశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో విత్తనాలు, ఎరువుల కోసం ఇబ్బందులు పడలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో క్యూలో నిలబడే పరిస్థితి వచ్చిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులకు సరిపడా విత్తనాలను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.