రామారెడ్డి, జూన్ 21: యూరియా యాప్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రామారెడ్డి మండలం ఉప్పల్వాయి గ్రామంలో రైతుబంధు సమితి మండల మాజీ కన్వీనర్ గురజాల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో రైతులు ఆదివారం ధర్నా చేపట్టారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకోవాలని ఏడీఏ సుధారాణి, అధికారులు ఉప్పల్వాయి గ్రామ రైతులకు సూచించారు.
సాంకేతిక కారణాలతో యాప్ సాయంత్రం 6 గంటలకు ఓపెన్ కావడంతో కొందరు రైతులు బుక్ చేసుకున్నారు. ఈ విషయం తెలియని ఉప్పల్వాయి గ్రామ రైతులు.. అధికారులు తమను తప్పుదోవ పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆదివారం ఆందోళన చేపట్టారు. యాప్ను తొలగించాలని, రైతులకు తప్పుడు సమాచారం ఇచ్చారని ఏడీఏను సస్పెండ్ చేయాలని ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. వ్యవసాయాధికారులు వచ్చే వరకు ధర్నా విరమించేదిలేదంటూ రైతులు భీష్మించుకు కూర్చున్నారు.
కామారెడ్డి ఎస్సై భువనేశ్వర్ సమాచారం మేరకు ఏడీఏ సుధారాణి హుటాహుటిన ఉప్పల్వాయి గ్రామానికి చేరుకొన్నారు. రైతులతో ఆమె మాట్లాడుతూ.. తాము సూచించిన సమయానికి సాంకేతికలోపంతో యాప్ పనిచేయలేదని, తర్వాత కొన్ని గంటల తర్వాత పనిచేయడంతో మండలంలోని పలు గ్రామాల రైతులు బుక్చేసుకున్నారని తెలిపారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు. యాప్ను రద్దుచేసి పాత పద్ధతిలోనే యూరియా అందించాలని రైతులు కోరారు. కార్యక్రమంలో ఉప్పల్వాయి గ్రామంతో పాటు యాప్లో బుక్ చేసుకున్న వివిధ గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.