ఆర్మూర్టౌన్, మే 14 : ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ అన్నదాతలు రోడ్డెక్కారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని ఆలూర్ ఎక్స్ రోడ్డు వద్ద బుధవారం రాస్తారోకో నిర్వహించారు. ఆందోళనలో పాల్గొన్న రైతులకు బీఆర్ఎస్ నాయకులు మద్దతు ప్రకటించి, రాస్తారోకోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
నెల రోజులుగా రోడ్లపైనే ధాన్యం వర్షానికి తడుస్తూ, ఎండకు ఎండుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. తడిసిన ధాన్యాన్ని షరతులు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆర్టీవో రాజాగౌడ్ చర్యలు తీసుకోవాలన్నారు. విషయం తెలుసుకున్న ఆర్డీవో రాజాగౌడ్ ఘటనా స్థలానికి చేరుకొని రైతులను సముదాయించి, ఆందోళన విరమింపజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ ఖేత్ నాయకుడు నూతుల శ్రీనివాస్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.