హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రణాళిక ఒక విఫల ప్రయోగం అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఎద్దేవా చేశారు. ఈ ప్రణాళికతో రేవంత్రెడ్డి సర్కార్ కొత్త డ్రామాకు శ్రీకారం చుట్టిందని ఆరోపించారు. హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ హరిచందన ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక-99 రోజుల యాక్షన్ ప్లాన్ సన్నాహక సమావేశంలో దాసోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రకటించిన ఈ కార్యక్రమంపై స్పష్టత ఇవ్వాలని కోరారు. 99 రోజుల వ్యవధిని ఏ ప్రాతిపదికన నిర్ణయించారో ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని, దీనికి ఎంత బడ్జెట్ కేటాయించారో చెప్పాలని డిమాండ్ చేశారు. నగరంలో దోమల బెడద తీవ్రంగా ఉందని, ఫాగింగ్ చర్యలు చేపట్టేందుకు కాంట్రాక్టర్లకు అవసరమైన నిధులు కేటాయించాలని సూచించారు. రోజురోజుకూ కుక్కల సమస్య పెరిగిపోతున్నదని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్షిప్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.