న్యూఢిల్లీ, మార్చి 6: రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు భారత్‌కు అమెరికా తాత్కాలిక అనుమతినిచ్చింది. అమెరికా-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో భారత్ చమురు కొరతను ఎదుర్కొనే ముప్పు ఏర్పడిన నేపథ్యంలో ఈ వెసులుబాటు కల్పించింది. యుద్ధం కారణంగా అంతర్జాతీయ చమురు మార్కెట్లలో అనిశ్చితి, రవాణాలో తీవ్ర అంతరాయం నెలకొన్న సంగతి తెలిసిందే. ట్యాంకర్లలో నింపి ఉంచి, ఎక్కడా అమ్ముడు పోకుండా సముద్రంలో చిక్కుకుపోయిన రష్యా చమురును భారత్ నెలరోజులపాటు కొనుగోలు చేయవచ్చని అమెరికా తెలిపింది.
భారత్‌పై ఆంక్షలు విధించకమునుపే ట్యాంకర్లలో లోడ్ చేసిన చమురుకు మాత్రమే ఈ వెసులుబాటు వర్తిస్తుందని అమెరికా ఆర్థికశాఖ మంత్రి స్కాట్ బెస్సెంట్ స్పష్టంచేశారు. భారత్‌కు తమకు అత్యంత ముఖ్యమైన భాగస్వామి అని అన్నారు. భారత్ త్వరలోనే అమెరికా నుంచి చమురు కొనుగోళ్లను వేగవంతం చేస్తుందని ఆశాభావంతో ఉన్నట్టు చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లలోకి చమురు సరఫరాను సరళతరం చేసేందుకే ఈ 30 రోజుల ఆంక్షల ఎత్తివేతను ప్రకటిస్తున్నట్టు తెలిపారు. ఈ వెసులుబాటు వల్ల భారత్‌లోని రిఫైనరీలు రష్యా చమురును కొనుగోలు చేయవచ్చని అన్నారు. యుద్ధం నేపథ్యంలో అత్యంత కీలకమైన హొర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన నేపథ్యంలో ఆ మార్గంలో నౌకల రాకపోకలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఆ మార్గం నుంచే భారత్ సహా ప్రపంచ దేశాలకు 20 శాతం మేరకు చమురు రవాణా అవుతుంది.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు భారత్‌కు అమెరికా అనుమతినివ్వడంపై దేశంలో ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. అమెరికా బ్లాక్మెయిల్ ఇంకా ఎంతకాలం కొనసాగుతుందని, ఇది అత్యంత సిగ్గుచేటు అని విరుచుకుపడ్డాయి. భారత సార్వభౌమత్వం, వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్నాయని ఆందోళన వ్యక్తంచేశాయి. ఎప్స్టీన్ ఫైల్స్, అదానీ కేసు కారణంగా అమెరికాకు మోదీ లొంగిపోయారని, బ్లాక్‌మెయిల్‌కు గురవుతున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. మోదీ ప్రభుత్వం వరుసగా ‘దౌత్యపరమైన ఆధిపత్యాన్ని వదులుకుంటున్నది’ అని వ్యాఖ్యానించారు.
‘అమెరికా తన సామంత దేశాలకు ఆంక్షలు విధించుకోవాలి, భారత్‌కు కాదు. ప్రపంచంలో భారత్ కూడా బాధ్యతాయుతమైన, సమాన భాగస్వామి. కానీ వాణిజ్యం నుంచి చమురు వరకు, డాటా నుంచి మిత్ర దేశాలతో దీర్ఘకాలిక సంబంధాల వరకు అన్నింటినీ మోదీ అమెరికాకు అప్పగించేశారు’ అని దుయ్యబట్టారు. తన గమ్యాన్ని తానే నిర్దేశించుకొనే గర్వించదగిన రికార్డు భారత్‌కు ఉండేదని, కానీ ఇప్పుడు అది మసకబారిందని విపక్ష నేతలు విమర్శించారు. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీతోపాటు వాజ్‌పేయి సహా ఏ ప్రధానీ ఇలా విదేశీ ఒత్తిళ్లకు తలొగ్గలేదని గుర్తుచేశారు.

ఇది మన విదేశాంగ విధానం కాదు, విదేశీ ఒత్తిళ్లకు దాసోహమన్న ఓ వ్యక్తి వల్ల కలిగిన ఫలితమిది అని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. ‘మనం ఎవరి వద్ద చమురు కొనాలో.. ఎవరి వద్ద కొనకూడదో అమెరికా నిర్ణయిస్తుంది. మన ప్రధాన మంత్రి ఆ నిర్ణయం తీసుకోరు’ అని ఎద్దేవా చేశారు. మనం ‘అమృత్కాల్’లో ఉన్నామని చెప్తున్న ప్రధాని చమురు కొనుగోలు చేసేందుకు అనుమతి కోసం ఇతర దేశాలను యాచిస్తున్నారని కేసీ వేణుగోపాల్ విమర్శించారు. అమెరికా నియంతృత్వ పోకడలను ఎదురించాల్సిందిపోయి మన ఇంధన సార్వభౌమత్వాన్ని పళ్లెంలోపెట్టి ఇతర దేశాలకు అందిస్తున్నారని ధ్వజమెత్తారు.
భారత్ తన సొంత నిర్ణయాలు తీసుకొనేందుకు ఇతర దేశాల అనుమతి కోరడం ఎప్పటి నుంచి మొదలైందని సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ విస్మయం వ్యక్తం చేశారు. ‘ఇది అత్యంత సిగ్గుచేటు. స్వతంత్ర భారత చరిత్రలో అంతర్జాతీయ వేదికపై ఇటువంటి అవమానం మనకు మునుపెన్నడూ ఎదురుకాలేదు’ అని అన్నారు. భారత్ సార్వభౌమ దేశంగానే ఉన్నదా లేక అమెరికాకు సామంత రాజ్యంగా మారిందా అన్న అంశంపై స్పష్టతనిస్తూ మోదీ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించాలని డిమాండ్ చేశారు. దీనిపై బీజేపీ ప్రభుత్వం ఏమైనా మాట్లాడుతుందా లేక ఎప్స్టీన్ ఫైల్స్ దాని పెదవులను మూసివేశాయా? అని సీపీఐఎంఎల్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య ప్రశ్నించారు. రష్యా చమురును ఎక్కడి నుంచి కొనాలో చెప్పడానికి అమెరికా ఎవరు అని శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది నిలదీశారు. మన నిర్ణయాలు తీసుకొనే ప్రక్రియనంతటినీ అమెరికాకు అప్పగించేశామేమో విదేశాంగ మంత్రి సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు.