బోధన్, జూన్ 22: రేవంత్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని మాజీ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ఉమ్మడి జిల్లా ఇన్చార్జి వీజీ గౌడ్ విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. బోధన్ పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే షకీల్ నివాసంలో సోమవారం బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదుతోపాటు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)పై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా వీజీ గౌడ్ హాజరై మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి కల్లబొల్లి కబుర్లు, మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాడని విమర్శించారు.
ఇప్పటికే రెండు యాసంగి పంటల రైతు బంధును ఎగ్గొట్టారని, రానున్న కాలంలో రైతులను మరింతగా దగా చేసే ప్రమాదం ఉన్నదని పేర్కొన్నారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా మోసం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ మోసాన్ని ప్రజలు గ్రహించారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద తులం బంగారం ఇస్తామని చెప్పి, ఇప్పటివరకు అమలుచేయలేదన్నారు.
కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కై బీఆర్ఎస్కు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు.
సభ్యత్వ నమోదులో చురుగ్గా పాల్గొనాలి బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పార్టీ శ్రేణులంతా చురుగ్గా పాల్గొనాలని కోరారు. ఈసారి సభ్యత్వ నమోదును ఆన్లైన్లో చేపడుతున్నట్లు తెలిపారు. సభ్యత్వ నమోదును బూత్ లెవల్ బాధ్యులు ఆన్లైన్లో చేయించాలని సూచించారు. సభ్యత్వం నమోదు కాగానే, వెంటనే రసీదు వస్తుందని, ఆన్లైన్లో పార్టీ ఐడీ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.
స్పెషల్ ఇంటెన్సివ్ ఓటరు రివిజన్‌పై బీఆర్ఎస్ కార్యకర్తలు, బూత్ లెవల్ ఏజెంట్లు అవగాహన పెంచుకోవాలని సూచించారు. ‘సర్’ ప్రక్రియలో పొరపాట్లను గమనిస్తూ బీఆర్ఎస్ సానుభూతిపరులు, శ్రేయోభిలాషుల ఓట్లు గల్లంతు కాకుండా చూడాలన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు రవీందర్ యాదవ్, గోగినేని నర్సయ్య, సంజీవ్‌కుమార్ పాల్గొన్నారు.
బీఆర్ఎస్ను సంస్థాగతంగా మరింతగా బలోపేతం చేసే లక్ష్యంతో చేపట్టిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కార్యకర్తలు, నాయకులు విజయవంతం చేయాలి. గతంలో రాష్ట్రంలో 60 లక్షల మంది బీఆర్ఎస్ సైన్యం ఉన్నది. దీనిని ఇప్పుడు 80 లక్షలకు పెంచాలన్నది రాష్ట్ర నాయకత్వం లక్ష్యం. ఇందుకు అనుగుణంగా బోధన్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు గతంలో కనీవినీ ఎరుగని రీతిలో చేపట్టాలి. ఈ కార్యక్రమంలో బూత్ కమిటీ సభ్యులు కీలకపాత్ర వహించాలి. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేయడం రేవంత్‌రెడ్డి తాత తరంకాదు. ఆంధ్రా సీఎంతో కుమ్మక్కై రాష్ట్ర ప్రయోజనాలకు ఏపీకి తాకట్టుపెడుతున్న రేవంత్‌రెడ్డికి ప్రజలు బుద్ధి చెబుతారు.
-దాదన్నగారి విఠల్‌రావు, బీఆర్ఎస్ బోధన్ నియోజవకర్గ సమన్వయ కర్త