Kotagiri | కోటగిరి, జూన్ 21 : ఆత్మగౌరవంతో తలెత్తుకొని పంట పండించే స్థాయికి తెలంగాణ రైతులు ఎదగడానికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేశారని, కానీ నేటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నదని కోటగిరి, పొతంగల్ మండలాల బీఆర్ఎస్ మండల నాయకులు తెల్ల రవికుమార్, మోరే కిషన్, డాక్టర్ హకీం, సుదం నవీన్ విమర్శించారు. కోటగిరి, పొతంగల్ మండల కేంద్రాల్లో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ హయంలో అమలు చేసిన పథకాల కంటే మెరుగైన పథకాలు అందిస్తామని మాయ మాటలు చెప్పి నేడు కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. రైతులు పండించిన పంట చివరి గింజ వరకు కొనుగోలు చేసే బాధ్యత కేసీఆర్ తన భుజాల వేసుకున్నారని, రైతులకు ఎటువంటి నష్టం జరగలేదని గుర్తు చేశారు. కానీ కేంద్రం ఏ పంటలు అయితే కొనుగోలు చేస్తుందో వాటిని మాత్రమే రాష్ట్రం కొంటుందని ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్రం కేవలం 20 శాతం పంటను మాత్రమే కొనుగోలు చేస్తుందని అలాంటప్పుడు మిగతా 75 శాతం పంటను ఎవరు కొనుగోలు చేస్తారో సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులను నట్టేట ముంచిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. రైతు భరోసా రైతు భీమా లాంటి రైతులకు సంబంధించిన విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం యాప్ ల పేరుతో రైతులను ఇబ్బందులు పెట్టే కుట్ర చేస్తుందని ఎలాంటి యాప్ లేకుండా రైతులకు నేరుగా యూరియా అందజేయాలి అన్ని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యాన్ని కొనుకుంటే తాము కూడా కొనలేమని చెప్పడం సిగ్గుచేటన్నారు.
కేంద్రంతో సంబంధం లేకుండా ప్రతీ గింజలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సన్న ధాన్యం కొంటామని చెప్పి కేవలం ఏడు రకాల వడ్లలను మాత్రమే ఎందుకు కొంటామంటున్నాడో రైతులకు చెప్పాలన్నారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ 24 గంటల కరెంటు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కేవలం ఉదయం మాత్రమే ఇస్తున్నదని అది కూడా టిప్ ల తో కూడిన సగం కరెంటు వస్తుందన్నారు. ధాన్యం కొనుగోలు, బోనస్ ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. అంతకు ముందు ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మోరే కిషన్ సమీర్ , బొట్టే గజేందర్,నజీర్, కప్ప సంతోష్ అంబాటి గంగా ప్రసాద్ గౌడ్, యోగేష్, పాల గంగారాం, కే సాయిలు, శివ తదితరులు పాల్గొన్నారు.