నాగిరెడ్డిపేట/నవీపేట, అక్టోబర్ 25: కొనుగోలు కేంద్రా ల్లో ధాన్యం సేకరణ ప్రారంభించాలని రైతులు రోడ్డెక్కా రు. నాగిరెడ్డిపేటలో శుక్రవారం అఖిలపక్షం నాయకులు రైతులతో కలిసి బోధన్, హైదరాబాద్ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ మనోహర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ రాజ్‌దాస్ మాట్లాడారు. నెలరోజులుగా రైతులు ధాన్యం రాశుల వద్ద పడిగాపులు కాస్తున్నారన్నారు. అకాల వర్షాలతో ఎండిన వడ్లు తిరిగి తడిసిపోతున్నాయని తెలిపారు. కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు ఇప్పటికీ కాంటాలను ప్రారంభించలేదన్నారు. వెంటనే కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు. రాస్తారోకో విషయం తెలుసుకున్న నాగిరెడ్డిపేట, లింగంపేట, ఎల్లారెడ్డి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులను బలవంతంగా బయటికి తీసుకువచ్చారు. అనంతరం అఖిలపక్షం నాయకులు ర్యాలీగా తహసీల్ కార్యాలయానికి చేరుకొని తహసీల్దార్ శ్రీనివాస్‌కు వినతిపత్రం అందించారు. రెండు రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించకపోతే..వేల మంది రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. రాస్తారోకో బీఆర్ఎస్ నాయకులు కృష్ణ, దుర్గారెడ్డి, మల్లేశం, వంశీగౌడ్, భాజపా ఎస్టీసెల్ మండల అధ్యక్షుడు దేవిసింగ్, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ధర్నా
నవీపేట మండలంలోని నాగేపూర్ సొసైటీ పరిధిలో ఉన్న గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ యంచ బాసర రహదారి పక్కన రైతుల ధర్నా నిర్వహించారు. వరి కోతలు ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా ప్రభుత్వం ఇప్పటివరకూ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులు పండించిన ధాన్యాన్ని దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పదినెలలవుతున్నా రైతు భరోసా, రైతు రుణమాఫీ అమలుచేయడంలేదని మండిపడ్డారు. కార్యక్రమంలో రైతులు వంజరీ రాజేశ్వర్, లాలు, మాజీ సర్పంచ్ లహరి ప్రవీణ్, నాగరావు తదితరులు పాల్గొన్నారు.