కోటగిరి, అక్టోబర్ 29: అకాల వర్షాలకు ధాన్యం తడుస్తున్నా సొసైటీ సిబ్బంది టార్పాలిన్లు ఇవ్వడంలేదని ఆగ్రహించిన అన్నదాతలు ఆందోళన చేపట్టారు. కోటగిరి మండల కేంద్రంలో సహకార సంఘం గోదాం వద్ద బుధవారం ధర్నా చేపట్టారు. అనంతరం కోటగిరి-పొతంగల్ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. సొసైటీ సిబ్బంది తీరుపై నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. సహకార సంఘం సిబ్బంది చిన్న రైతులను పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. ఇప్పటికే ధాన్యం విక్రయించుకున్న పెద్ద రైతులకు అవసరం లేకున్నా టార్పాలిన్లు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
చిన్న రైతులకు చెందిన ధాన్యం వర్షాలకు తడిసి, మొలకలు వస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారని వాపోయారు. తమకు టార్పాలిన్లు ఇచ్చేవరకూ ఇక్కడి నుంచి కదిలేదిలేదని రోడ్డుపై భీష్మించుకు కూర్చున్నారు. గంటపాటు రాస్తారోకో చేయడంతో రోడ్డుకు ఇరువైపులా పెద్దసంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సముదాయించే ప్రయత్నం చేసినా వారు ససేమిరా అన్నారు. స్థానిక మాజీ ప్రజాప్రతినిధి ఘటనా స్థలానికి చేరుకొని రైతుల సమస్యను అడిగి తెలుసుకున్నారు. తమకు టార్పాలిన్లు ఇప్పించాలని డిమాండ్ చేశారు. సొసైటీ సిబ్బందితో మాట్లాడి టార్పాలిన్లు ఇప్పిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.