బోధన్, ఏప్రిల్ 13: స్వామినాథన్ సిఫార్సుల మేరకు రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు అందించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ (ప్రజాపంథా) నేతలు సోమవారం సాలూరా తహసీల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్వామినాథన్ సిఫార్సుల మేరకు రైతు దుక్కిదున్ని నారుపోసి ఎరువులు, పురుగుమందులు, కూలీలు, అప్పులు, వడ్డీలు సహా అన్నీ కలిపి, వాటిపై 50శాతం లాభం వచ్చేలా పంటలకు గిట్టుబాటు ధర అందించాలని అన్నారు. నేటి ఖర్చుల ఆధారంగా క్వింటా ధాన్యానికి రూ. 4 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
సాలూరా మండల పరిధిలో రైతాంగం అధిక శాతం మక్కజొన్న వేశారని, వీటి కొనుగోలుకు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక చిన్న, సన్నకారు రైతులు దళారులకు విక్రయించేశారని మాస్‌లైన్ బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి బండారు మల్లేశ్ తెలిపారు. ప్రభుత్వాలు పరోక్షంగా దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తున్నాయని ఆరోపించారు. ఇప్పటికైనా రైతుల సంక్షేమానికి ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని, పంటలకు గిట్టుబాటు ధరలు అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం సాలూరా తహసీల్దార్‌కు వినతిపత్రం అందచేశారు. నాయకులు ఇల్తెపు గంగారాం, జి.దేవయ్య, సిహెచ్. రమేశ్, జి.గంగారాం, వి. సుధాకర్, సి. రాజు, గంగారాం, రైతులు ఉన్నారు.