యూరియా యాప్‌ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతాంగం పోరుబాట పట్టింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా యాప్‌తో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే యాప్‌ను రద్దు చేయాలంటూ భీమ్‌గల్, నందిపేట్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టగా, మోర్తాడ్ మండల కేంద్రంలో మూడు గ్రామాల రైతులు జాతీయ రహదారిని దిగ్బంధించారు. నందిపేట్‌లో నిర్వహించిన రాస్తారోకోలో ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి పాల్గొన్నారు. యూరియా యాప్ విధానం రద్దు చేసే వరకూ పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు.
నందిపేట్, జూన్ 15: రైతాంగాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ వ్యవసాయాన్ని కుంటుపర్చేలా ప్రభుత్వం అమలుచేస్తున్న యూరియా యాప్ రైతులకు ఉరితాడుగా మారింది, యాప్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా మాజీ అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో సోమవారం రైతులు చేపట్టిన భారీ ధర్నా లో ఆయన పాల్గొన్నారు. రైతులతో కలిసి రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. సాంకేతికత పేరుతో ప్రభుత్వం తీసుకొచ్చిన యూరియా యాప్ రైతులకు ఉపయోగపడడం కన్నా ఇబ్బందులు సృష్టిస్తోందని మం డిపడ్డారు.
గ్రామీణ ప్రాంతాల్లో నెట్వర్క్ సమస్యలు, స్మార్ట్ ఫోన్లు లేని రైతుల పరిస్థితిని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. యాప్ ద్వారా యూరియా పంపిణీ చేయడంతో రైతులు ఎరువుల కోసం రోజుల తరబడి తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయాన్ని సులభతరం చేయాల్సిన ప్రభుత్వం తుగ్లక్ నిర్ణయాలతో రైతులపై అదనపు భారాన్ని మోపుతున్నదని మండిపడ్డారు. రైతులకు సకాలంలో ఎరువులు అందక పంటలు దెబ్బ తింటున్నా పట్టించుకోవడంలేదన్నారు. యూరియా యాప్ కారణంగా బ్లాక్ మార్కెట్ పెరిగే ప్రమాదం ఉన్నదని, రైతులు ప్రైవేట్ వ్యాపారుల చేతిలో దోపిడీకి గురవుతున్నారని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ రైతాంగానికి ఎరువుల కొరత రాకుండా చర్యలు తీసుకున్నారని గుర్తుచేశారు. కానీ నేడు రైతులు ఎరువుల కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా మునుపటిలాగే గుర్తింపు కార్డుల ఆధారంగా నేరుగా ఎరువులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
వానకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా సరిపడా యూరియా, ఇతర ఎరువుల నిల్వలను వెంటనే అందుబాటులో ఉంచాలని కోరారు. రైతులకు శాపంగా మారిన యూరియా యాప్‌ను వెంటనే రద్దు చేయాలని, లేని పక్షంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, నందిపేట్, డొంకేశ్వర్ మండల బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.