ఖలీల్‌వాడి, ఫిబ్రవరి 28 : ఉమ్మడి జిల్లాలో రైతులను యూరియా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఒకవైపు యూరియా కొరత వేధిస్తుండగా, మరోవైపు ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఫర్టిలైజర్ యాప్‌తో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నిచోట్ల యాప్ ద్వారా బుక్ చేసుకున్నా యూరియా అందని పరిస్థితి నెలకొన్నది. అదనపు మీద యూరియా అందకపోవడంతో ఆగ్రహించిన రైతులు ఆందోళన బాటపడుతున్నారు.
శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బోర్గాం సొసైటీ పరిధిలోని రైతులు రోడ్డెక్కారు. యాప్ ద్వారా బుక్ చేసుకున్న రైతులు యూరియా కోసం సొసైటీకి రాగా లేదని సిబ్బంది చెప్పడంతో ఆగ్రహించిన రైతులు మంచిప్ప రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. రైతుకు సరిపడా యూరియా ఇవ్వాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. యాప్, ఆన్లైన్లో కాకుండా పాత పద్ధతిలోనే అడిగిన ప్రతి రైతుకూ యూరియా అందించాలని డిమాండ్ చేశారు. రైతులందరి వద్ద పెద్దఫోన్లు లేకపోవడంతో యూరియా పొందలేకపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు.
విషయం తెలుసుకున్న జేడీఏ వీరస్వామి ఘటనా స్థలికి వచ్చి యూరియా అందిస్తామని రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. తక్షణమే ఒక లోడ్ యూరియా అందిస్తామని, రైతులందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని ఏవో, ఏఈవోలను ఆదేశించడంతో రైతులు శాంతించారు. ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు వేల్పూర్ భూమయ్య, రైతు నాయకులు ఈగ సాయిరెడ్డి, రాజేశ్వర్ మాట్లాడుతూ.. రైతులకు యూరియా అందించడంలో రేవంత్‌రెడ్డి ప్రభు త్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. సొసైటీ మాజీ చైర్మన్ హన్మాండ్లు, సూర్యరెడ్డి, తిరుపతి, సంజీవ్, గణేశ్, కుర్మ సంజీవ్, తలారి సాగర్, వేల్పూర్ గంగారాం, కిషన్, దశరథ్, మల్కారెడ్డి, భుజేందర్ పాల్గొన్నారు.