కోటగిరి, ఏప్రిల్ 17: రోజులు గడుస్తున్నా ధాన్యాన్ని కాంటా చేయడంలేదంటూ మండలంలోని కొత్తపల్లి విండో పరిధిలోని లింగాపూర్, గన్నారం రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. పెద్ద రైతులకే కాంటా చేస్తూ, విండో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవరిస్తున్నారని మండిపడ్డారు. గురువారం వారు కోటగిరి తహసీల్ కార్యాలయానికి చేరుకొని ఆందోళన చేపట్టారు. ధాన్యం రోడ్లపై ఆరబోసి నెలలు గడుస్తున్నా గన్నీ సంచులు ఇవ్వడం లేదని, కాంటా కూడా చేయడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. రైతులంటే అంత అలుసా అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తహసీల్దార్ గంగాధర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన తహసీల్దార్ వెంటనే కొత్తపల్లి విండో సీఈవోతో కలిసి లింగాపూర్ చేరుకున్నారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా గన్నీ సంచులు ఇవ్వడం లేదని, సీరియల్ ప్రకారం కాంటా చేస్తలేరని, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని తహసీల్దార్‌కు వివరించారు. గన్నీ సంచులు అందించి, కాంటా వేసే ప్రక్రియను వేగవంతం చేసేలా చర్యలు తీసుకుంటామని రైతులకు తహసీల్దార్ భరోసా ఇచ్చారు.