పొతంగల్, ఏప్రిల్ 23: ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ రైతులు రోడ్డెక్కారు. గన్నీ సంచులు, లారీల కొరత తీర్చాలని, కొనుగోలు చేసినా ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని కోరుతూ పొతంగల్ చెక్‌పోస్టు వద్ద అన్నదాతలు బుధవారం ఆందోళన చేపట్టారు. రోడ్డుపై ద్విచక్ర వాహనాలు నిలిపి, అక్కడే బైఠాయించారు. సమస్యను పరిష్కరించేవరకు కదిలేది లేదని భీష్మించుకొని కూర్చున్నారు.
ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగుల కొరత ఉన్నదన్నారు. తూకం వేసిన ధాన్యం బస్తాలు వేల సంఖ్యలో ఉన్నాయని అన్నారు. మిల్లులకు వెళ్లిన ధాన్యం బస్తాలను వెంటనే అన్లోడింగ్ చేయడం లేదన్నారు. దీంతో లారీలు రాక ఇబ్బంది పడాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు.
ఇదే సమయంలో పొతంగల్ మీదుగా వెళ్తున్న బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి విషయం తెలుసుకొని రైతుల వద్దకు వచ్చి మాట్లాడారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. బుధవారం సాయంత్రం వరకు గన్నీ బ్యాగులతోపాటు లారీలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. నిజామాబాద్‌కు కాకుండా లోకల్ రైస్ మిల్లులకు అలాట్మెంట్ ఇవ్వాలని రైతులు కోరారు. అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు.