పొతంగల్, అక్టోబర్ 27: విక్రయించిన సోయా వాపసు రావడంపై రైతులు మళ్లీ ఆందోళన చేపట్టారు. విక్రయిస్తున్న సమయంలో 51 కిలోల కాంటా పెట్టిన బ్యాగు 45 కిలోలతో తిరిగి ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ పొతంగల్ మండలం హెగ్డోలి కొనుగోలు కేంద్రం వద్ద ఆదివారం రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. ఎలక్ట్రానిక్ కాంటాపై సోయాబస్తా ఉంచి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. సోయా కొనుగోలు చేసిన అనంతరం మరోసారి సగం ధాన్యం వాపసు వచ్చిందని తెలిపారు.
సుమారు పదిమందికి చెందిన 102 సోయా బ్యాగులను తీసుకెళ్లాలని సొసైటీ అధికారులు చెబుతున్నారని వాపోయారు. కొనుగోలు చేసిన ధాన్యం బాగోలేదని అంటున్నారని మండిపడ్డారు. తేమ శాతం, మ్యాచర్ వచ్చిన తర్వాతే కొనుగోలు చేశారని, ఇప్పుడు బాగోలేదని వాపసు పంపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కొనుగోలు చేసినప్పుడు కిలో తరుగుతో 51 కిలో కాంట చేసిన సోయా బ్యాగు.. వాపసు వచ్చిన తరువాత 45 కిలోలకు చేరిందని ప్రత్యక్షంగా కాంటా చేసి చూపించారు. దీనికి బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. వాపసు పంపిన ధాన్యాన్ని అధికారులే పూర్తిగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు.