కోటగిరి : మండలంలోని ఎత్తుండా సహకార సంఘం సిబ్బందిపై రైతులు సీరియస్ అయ్యారు. కొనుగోలు కేంద్రాల్లో సహకార సంఘం సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ కాంటలు చేయకుండా ఇష్టం వచ్చినట్లు కాంటాలు చేస్తున్నారని రైతులు మండిపడ్డారు. మొదట వడ్లను ఎండబెట్టిన రైతుల కంటే తర్వాత వచ్చిన రైతుల వడ్లను కాంటా చేస్తున్నారని రైతులు ఆరోపించారు. చిన్న రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సంఘం కార్యాలయ గేట్‌కు రైతులు తాళం వేసి ఆందోళనకు దిగారు. తాళం వేసిన గేటు ఎదుట రైతులు నిరసన తెలిపారు. పితుండ సహకార సంఘంలో కొనుగోలు కేంద్రాల్లో కేవలం రెండు కాంటాలే కొనసాగుతున్నాయని మరో ఆరు కాంటలు అదనంగా అవసరం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యంగా లారీల కొరత తీవ్రంగా ఉందని, రైతుల సమస్య ఎవరు కూడా పట్టించుకోవడంలేదన్నారు. వడ్లు ఆరాబోసి వారం రోజులు గడుస్తున్న హమాలీలు లేకపోవడం వల్ల కాంటాలు కావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు అధికారులు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గేటు ఎదుట మండు టెండలోనే నిరసన తెలిపారు. ఈ విషయంపై తహసిల్దార్ గంగాధర్ తక్షణమే స్పందించి సహకార సంఘం వద్దకు చేరుకున్నారు. సంఘటనకు సంబంధించి సమస్యలను రైతులతో అడిగి తెలుసుకున్నారు. సంబంధిత శాఖ వారితో మాట్లాడి లారీల సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకున్నారు. దీంతో రైతులు శాంతించారు.