నిజామాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రూ.లక్ష లోపు రుణం మాఫీ అవుతుందని ఆశగా ఎదురుచూసిన ఉమ్మడి జిల్లా రైతాంగానికి తొలిరోజు నిరాశే మిగిలింది. కాంగ్రెస్ సర్కారు గురువారం ప్రారంభించిన పంట రుణాల మాఫీ పథకంలో భాగంగా సగం మందికే లబ్ధి కలిగింది. లక్షలాది మంది రైతుల లోన్లు మాఫీ కాలేదని తెలిసింది. వారికి ఎప్పుడు ఇస్తారనేది స్పష్టత కరువైంది. తొలి విడుతలో రూ.లక్ష లోపు పంట రుణాలను మాఫీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహా మంత్రులు, కాంగ్రెస్ నేతలు ప్రకటనలు చేశారు.
కానీ, అమలులోకి వచ్చే సరికి కొందరి లోన్లే మాఫీ కావడం, మిగతా వారికి కాకపోవడంతో రైతాంగంలో ఆందోళన నెలకొన్నది. తొలిరోజు ఉమ్మడి జిల్లాలోని 86,764 కుటుంబాలకు సంబంధించిన పంట రుణాల మొత్తం రూ.461 కోట్లను ప్రభుత్వం బ్యాంకులకు విడుదల చేసింది. అయితే, సర్కారు మార్గదర్శకాల ప్రకారం ఉమ్మడి జిల్లాలో లక్షలాది మంది రైతులు అర్హులు కాగా, వేల సంఖ్యలోనే రైతులకు మాఫీ వర్తించడం చర్చనీయాంశమైంది. కుటుంబం యూనిట్‌గా తీసుకుని రుణాలను మాఫీ చేయడం ద్వారా చాలా మందికి నష్టం వాటిల్లింది.
తొలి విడుతలో 86,764 కుటుంబాలకు సంబంధించిన రుణాలు మాఫీ అయ్యాయి. కానీ, పంట రుణాలు తీసుకున్న వారి సంఖ్య అంతకు మూడు రెట్లు ఉన్నప్పటికీ, వారందరికీ మాఫీ కాలేదు. ఇందులో సన్న, చిన్నకారు రైతులు కూడా ఉండడంతో వారంతా తీరని మనోవేదనకు గురయ్యారు. రైతులపై రుణ భారాన్ని తగ్గించేందుకు ఉద్దేశించిన ఈ కార్యక్రమంలో ప్రధానంగా ప్రభుత్వమే తమపై ఉన్న భారాన్ని వదిలించుకునేందుకు తహతహలాడినట్లుగా కనిపిస్తున్నది.
రుణమాఫీ హామీ అమలు చేయడంలో కాంగ్రెస్ ద్వంద నీతిని అవలంభించింది. పథకం అమలు కోసం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు రైతులను బురిడీ కొట్టించి అనేక మందికి మాఫీ కాకుండా చేసినైట్లెంది. డిసెంబర్ 12, 2018 నుంచి డిసెంబర్ 9, 2023 వరకు తీసుకున్న పంట రుణాలన్నీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ, కుటుంబంలో ఒకరికే వర్తింపజేసినట్లు తెలిసింది. ఒకింట్లో వారసులు ఇద్దరు కన్నా ఎక్కువ ఉండి రేషన్ కార్డు లేకపోతే వారిలో ఒకరికే వర్తించింది.
కిసాన్ సమ్మాన్ యోజనకు అర్హులైన వారందరినీ ఇందుకు ప్రామాణికంగా తీసుకోవడంతో ఐటీ చెల్లింపుదారులకు రుణమాఫీ షాక్ తగిలింది. గతంలో కేసీఆర్ సర్కారు ఉన్నప్పుడు షరతుల్లేకుండా రుణమాఫీ అమలు చేసింది. వ్యవసాయ భూములపై వివిధ బ్యాంకుల్లో తీసుకున్న రుణాలన్నింటినీ రద్దు చేసి పెద్ద మనసును చాటుకున్నారు. కానీ, రేవంత్ సర్కారు మాత్రం అడుగడుగునా రైతులను దగా చేసేందుకు ప్రయత్నించినట్లు కనిపిస్తున్నది.
కోటగిరి, జూలై 18: నాకు మల్కాపూర్ శివారులో 1.23ఎకరాలు భూమి ఉన్నది. పంట సాగు కోసం నాలుగేండ్ల క్రితం రూ.44వేలు పంట రుణం తీసుకున్న. సీఎం రేవంత్‌రెడ్డి రుణమాఫీ చేస్తామంటే గత ఏడు నెలల నుంచి ఎదురుచూస్తున్నా. గురువారం ప్రకటించిన రుణమాఫీ జాబితాలో నా పేరు లేదు. సంబంధిత శాఖ వారికి అడిగితే సరైనా సమాధానం చెప్పడం లేదు. రుణమాఫీ గురించి ఎవరిని అడగాలి. రైతులకు రుణమాఫీ చేస్తామని చెబుతున్నారు కానీ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే అధికారుల తప్పిదంతో హామీలు పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. అధికారులు స్పందించి తన పేరిట ఉన్న రుణం మాఫీ అయ్యేలా చూడాలని కోరుతున్నా.
-నార్ల సాయి శ్రీనివాస్, రైతు, కోటగిరి
భీమ్‌గల్, జూలై 18: ఎన్నికలప్పుడు ఒకేసారి రెండు లక్షలు మాఫీ అని చెప్పిండు. ఇప్పుడు మూడు విడుతలు అని రైతులను ఆగం చేస్తుండు. ఎవరికి వస్తదో రాదో అని రైతులందరం ఆగమైతున్నం. బ్యాంకులల్ల వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నాం. మాఫీ వస్తదని ఎదురుచూస్తున్నం. అందరికీ ఒకేసారి చేస్తే మంచిగా ఉంటది.
– శర్మానాయక్, రైతు,రహత్‌నగర్
మాక్లూర్, జూలై 18: లక్షలోపు ఉన్న రైతులందరికీ రుణమాఫీ చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించినా.. మొదటి రోజు ప్రకటించిన జాబితాలో నా పేరు లేదు. గతేడాది ఆగస్టులో ఇండియన్ బ్యాంకులో రూ.50వేలు పంట రుణం తీసుకున్న. రూ.లక్ష లోపు ఉన్న రైతులందరికీ మొదటి రోజు మాఫీ డబ్బులు వేస్తున్నామని ప్రభుత్వం చెప్పింది.కానీ నాకు రాలేదు.
– న్యాలకంటి భోజన్న, రైతు, ముల్లంగి(బీ)
భీమ్‌గల్, జూలై 18: రుణమాఫీ కోసం ఏడు నెలల నుంచి ఎదురుచూస్తున్నాం. చివరికి గురువారం సీఎం రేవంత్‌రెడ్డి రూ.లక్ష లోపు రుణాలను మాఫీ చేసిండు. కానీ అందరికీ ఒక్కసారే చేస్తా అని చెప్పి.. ఇప్పుడు రెండో విడుత, మూడో విడుత అంటున్నాడు. ఎప్పుడు వస్తాయోనని ఎదురుచూసుడే ఉన్నది.
-మూత లింబాద్రి, రైతు, భీమ్‌గల్
నవీపేట, జూలై 18: మొదటి విడుత రూ.లక్ష రుణమాఫీ లిస్టులో నా పేరు రాలేదు. చాలా బాధగా అనిపించింది. నాకు ఎకరం భూమి ఉన్నది. గతేడాది ఆగస్టులో జన్నేపల్లి కెనరా బ్యాంక్‌లో రూ. 60వేల పంట రుణం తీసుకున్న. మా కుటుంబంలో ఎవరికీ రుణమాఫీ కాలేదు. సీఎం రేవంత్‌రెడ్డి 2018 డిసెంబర్ నుంచి 2023 డిసెంబర్ వరకు మాఫీ వర్తిస్తుందని చెప్పిండు. రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. నాతోపాటు మా ఊర్లో చాలా మంది రైతులకు లక్ష లోపు రుణాలు మాఫీ కాలేదు.
– చిన్నుబాయి, మాజీ సర్పంచ్, నారాయణపూర్
బోధన్, జూలై 18: ఇతని పేరు చింతల పెద్ద లక్ష్మన్, స్వగ్రామం ఎడపల్లి. తనకున్న చిన్నమొత్తానికి బ్యాంకు ద్వారా రూ. 31వేల రుణాన్ని పొందాడు. రుణమాఫీ జరగాలంటే లోన్ రెన్యువల్ చేసుకోవాలని అధికారులు చెబితే రెన్యువల్ చేయించుకున్నాడు. అయితే, రూ.లక్షలోపు రుణాలు గురువారం మాఫీకి చెందిన లిస్ట్‌ను బ్యాంకర్లు, వ్యవసాయశాఖ అధికారులకు అందిస్తే అందులో లక్ష్మన్ పేరు లేదు. దీంతో తనకన్నా ఎక్కువ మొత్తంలో రుణం ఉన్నవారి పేరు మాఫీ లిస్ట్‌లో ఉన్నా.. తన పేరు లేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తన పేరు ఎందుకు లేదో నాకు అర్థం కావడం లేదని, రుణమాఫీకి తాను అనర్హుడిని అయితే, తనకు నోటీసులు ఎందుకు పంపారని ప్రశ్నిస్తున్నాడు.